ఇళ్ల కూల్చివేతపై ఫిర్యాదు
మొయినాబాద్: ఇళ్ల కూల్చివేతపై గిరిజన బాధితులు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలో ఉన్న రాఘవేంద్ర సొసైటీలో ఇతర ప్రాంతాలకు చెందిన 50 గిరిజన కుటుంబాలు ప్లాట్లు కొనుగోలు చేసి కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు, హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులతో వెళ్లి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ ఇళ్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ ఇళ్లు కూల్చడానికి శ్రీనివాస్‌రాజు, సురేష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజుగౌడ్ కారణమంటూ గురువారం బాధితులు మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్లాట్లు చేసిన భూమిని శ్రీనివాస్‌రాజు, సురేష్‌రెడ్డి రాఘవేంద్ర సొసైటీ నుంచి ఎలా కొంటారని.. తాము నిర్మించుకున్న ఇళ్లు, ప్లాట్ల ప్రహరీలను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. తామంతా ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని.. కరెంటు మీటర్లు తీసుకున్నామని.. కొందరికి ఇంటి నంబర్లు కూడా వచ్చాయని తెలిపారు. అలాంటి ఇళ్లను మున్సిపల్ అధికారులు ఎందుకు కూల్చారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం తెల్లవారుజామున వంద మంది పోలీసులు, వంద మంది బౌన్సర్లు వచ్చి తమను ఇళ్లు ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురిచేశారని.. మున్సిపల్ అధికారులు వచ్చి అక్రమంగా నిర్మించారంటూ సీసీ కెమెరాలు, కరెంటు ఆఫ్ చేసి జేసీబీలతో కూల్చివేశారని తెలిపారు. అక్రమ నిర్మాణాలైతే అధికారులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్లను ఇతరులకు అప్పజెప్పేందుకు మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. తమ ఇళ్లు కూల్చివేయడానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.


