ఆశావహుల సందడి
జిల్లాలోని మున్సిపాలిటీలు, వార్డులు ఇలా..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పురపోరుకు రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల్లో ‘హస్తం’ హవా కొనసాగడంతో అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓటర్ల జాబితా సిద్ధం చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లోని అధికారులు వార్డుల వారీగా ఉన్న ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయాల్లో డ్రాప్ట్ పబ్లికేషన్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
10న ఓటర్ల తుదిజాబితా
జిల్లాలో 14 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఉండగా, వీటిలో మీర్‌పేట్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, నార్సింగి, మణికొండ, పెద్ద అంబర్‌పేట్, తుర్కయంజాల్, తుక్కుగూడ, శంషాబాద్, జల్‌పల్లి, ఆదిబట్ల మున్సిపాలిటీలను ప్రభుత్వం ఇటీవల జీహెచ్‌ఎంపీలో విలీనం చేసింది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను రద్దు చేసి, వార్డులను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన మొయినాబాద్, చేవెళ్ల సహా మరో ఐదు మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే మున్సి పాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ.. 2025 అక్టోబర్ జాబితా ప్రకారమే ఓటరు జాబితా ఉంటుందని ప్రకటించింది. గురువారం ఆయా మున్సి పాలిటీల్లో డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకటించింది. ఈ నెల 5 వరకు ఆయా రాజకీయ పార్టీల నుంచి ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనుంది. ఈ నెల 10న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది.
రిజర్వేషన్లు రావడమే తరువాయి
మున్సిపాలిటీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తుండటంతో ఆశావహులు పోటీకి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయా మున్సిపల్ కేంద్రాల్లో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటి వరకు మున్సిపాలిటీని పట్టించుకోని వారు సైతం ప్రస్తుతం అక్కడే మకాం వేసి కూర్చొంటున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సరి చూసుకుంటున్నారు. ముఖ్య నేతల కంటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. వార్డులు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు కావడమే ఆలస్యం.. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు.
పురపోరుకు సన్నాహాలు
వార్డుల వారీగా ఓటర్ల జాబితా
మున్సిపాలిటీల్లో వెలిసిన ఫ్లెక్సీలు
వార్డుల్లో నేతల పర్యటనలు
పార్టీ పెద్దల కంట్లో పడేందుకు ఎవరికివారు తాపత్రయం
మున్సిపాలిటీ వార్డులు పోలింగ్ కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
ఆమనగల్లు 15 30 8,475 8,509 – 16,984
చేవెళ్ల 18 36 12,579 12,791 1 25,371
ఇబ్రహీంపట్నం 24 50 12,741 13,252 – 25,993
మొయినాబాద్ 26 31 16,172 15,988 1 32,161
షాద్‌నగర్ 28 59 26,679 26,,723 1 53,403
శంకర్‌పల్లి 15 30 10,551 10,850 – 21,401
మొత్తం 126 236 87,197 88,113 03 1,75,313


