అవిశ్వాస గళం!
● మదర్ డెయిరీ చైర్మన్‌పై డైరెక్టర్ల గుర్రు
● ప్రత్యేక సమావేశం కోసం నోటీసు
హయత్‌నగర్: నల్లగొండ –రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (నార్ముల్ మదర్‌డెయిరీ) పాలక వర్గంలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. రైతులకు బకాయిలు చెల్లించడంలో విఫలం అయ్యాడంటూ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి రాజీనామా చేయాలని మెజారిటీ సభ్యులు వారం రోజులగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాలకమండలి ప్రత్యేక సమావేశం పెట్టాలని 11 మంది సభ్యులు గురువారం ఎండీకి నోటీసు ఇచ్చారు. డెయిరీని సమస్యల నుంచి గట్టెక్కించడంలో చైర్మన్ విఫలం అయ్యాడని భావిస్తున్న సభ్యులు ఆయనను పదవి నుంచి దించేందుకు వారం రోజులుగా పావులు కదుపుతున్నారు. రాజీనామాకు చైర్మన్‌ను ఒప్పించాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం ఈ మేరకు డిసెంబర్ 31న సమావేశం కావాలని డెయిరీ కార్యాలయానికి సభ్యులు హాజరు కాగా చైర్మన్ రాలేదు. దీంతో ఎలాగైనా చైర్మన్‌ను తొలగించాలనే ఉద్దేశంతో ప్రత్యేక సమావేశానికి నోటీసు ఇచ్చినట్లు సమాచారం. అప్పుల నుంచి డెయిరీని రక్షించుకోవడం కోసం ఎన్‌డీడీబితో ఒప్పందం చేసుకుంటామని గత జనరల్ బాడీ మీటింగ్‌లో ప్రకటించిన చైర్మన్ ఒప్పందం చేసుకోవడంలో విఫలమయ్యాడని, దీంతో రైతులకు బకాయిలు పెరిగిపోయి పాలుపోయడం తగ్గించారని డైరెక్టర్‌లు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే డెయిరీ మనుగడ కష్టం అని భావిస్తున్నారు. ఒప్పందం చేసుకోవడానికి ఎన్‌డీడీబీ వెనకడుగు వేయడం.. అప్పుల భారం పెరిగిపోవడం.. రైతులు పాలు పోయడం తగ్గించడం.. మార్కెట్‌లో సేల్స్ తగ్గడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు కొత్తగా మరో చైర్మన్ ఎన్నుకోవడమే మార్గమని డైరెక్టర్‌లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


