కొత్తేడాది.. ఆలయాలకు పోటెత్తి
● చిలుకూరులో మార్మోగిన గోవింద నామస్మరణ
● భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
మొయినాబాద్: కొత్త సంవత్సరం.. కొంగొత్త ఆశలు.. భక్తుల అడుగులన్నీ చిలుకూరు వైపే.. నూతన ఏడాది మొదటి రోజు దైవ సన్నిధిలో గడపాలని.. కోరికలు నెరవేర్చుకోవాలని జనమంతా చిలుకూరు బాట పట్టారు. తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీని దర్శించుకోవడానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఎటు చూసిన భక్తజనం.. గోవింద నామస్మరణలు, కీర్తనలతో చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణమంతా మార్మోగింది. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే అనుమతించడంతో అప్పటికే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రద్దీ కొనసాగింది. దీంతో స్వామివారిని దర్శించుకోవడానికి నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందే మహిళ లు, పురుషులను వేర్వేరు క్యూలైన్లలో పంపించారు.
ఎటు చూసినా భక్తజనమే
చిలుకూరు బాలాజీ దేవాలయ పరిసరాల్లో ఎటు చూసినా భక్తజనమే కనిపించారు. నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాలాజీని దర్శించుకున్నారు. వాహనాల పార్కింగ్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి వేర్వేరు దారులు ఏర్పాటు చేయడంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా భక్తులు నేరుగా వచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకుడు రంగరాజన్ పర్యవేక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అర్చకులు తెలిపారు.
పటిష్ట బందోబస్తు
బాలాజీ దేవాలయానికి భారీగా భక్తులు తరలిరావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్‌గౌతం, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. సుమారు వంద మంది పోలీసులు, వంద మంది వాలంటీర్లతో బందోబస్తు నిర్వహించారు. భారీగా భక్తులు రావడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. పెద్ద సంఖ్యలో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల్లో రావడంతో చిలుకూరు నుంచి అప్పా జంక్షన్ వరకు ట్రాఫిక్ ప్రభావం కనిపించింది. హిమాయత్‌నగర్‌లో కొంత సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వాహనాలను రోడ్ల పక్కన నిలుపనీయకుండా చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
కిటకిటలాడిన ‘మైసిగండి’
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన మైసమ్మ దేవతను గురువారం భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం కావడంతో ఆలయ పరిసరాలు భక్తజనంతో నిండిపోయాయి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సందడితో పరిసరాలు కిటకిటలాడాయి. పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.


