ఎకరా వరికి రెండు బస్తాలే! | - | Sakshi
Sakshi News home page

ఎకరా వరికి రెండు బస్తాలే!

Jan 2 2026 12:26 PM | Updated on Jan 2 2026 12:26 PM

ఎకరా వరికి రెండు బస్తాలే!

ఎకరా వరికి రెండు బస్తాలే!

షాబాద్‌: వానాకాలం పంటలకు సకాలంలో యూరియా అందక రైతులు ఇబ్బంది పడ్డారు. చాలా మంది అదనుకు ఎరువు వేయలేకపోయారు. దీంతో దిగుబడిపై ప్రభావం చూపింది. చాలాచోట్ల అన్నదాతలు యూరియా కోసం రోడ్లెక్కారు. ఈ నేపథ్యంలో యాసంగిలో అలాంటి సమస్య రావొద్దని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యాసంగి సీజన్‌లో సకాలంలో ఎరువులు అందించడంతో పాటు వాడకాన్ని నియంత్రించేందుకు యూరియా బుకింగ్‌ యాప్‌ను తెచ్చింది. ఇంటి నుంచే బుకింగ్‌ చేసి సమీప దుకాణాల్లో ఎరువులు స్వీకరించవచ్చు.

యాసంగి సాగు ఇలా

జిల్లాలో యాసంగి సీజన్‌లో 3.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా. వరి 1.30 లక్షల ఎకరాలు, మొక్క జొన్న లక్ష ఎకరాలు, శనగ 50 వేల ఎకరాలతోపాటు పప్పు ధాన్యాలు, ఇతర పంటలు కూడా ఉన్నాయి. ఈ పంటలకు 28 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికే 11 వేల టన్నుల నిల్వలున్నాయి. అవసరమైతే మరిన్ని సరఫరాలు చేస్తారు.

మార్గదర్శకాలు ముఖ్యం

రైతులు తమ అవసరాల ప్రకారం కాకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మాత్రమే యూరియా పొందుతారు. యాప్‌లో పంట వివరాలు, ఎకరాల సంఖ్య నమోదు చేస్తే అవసరమైన బస్తాలు, సమయాలు సూచిస్తుంది. శాస్త్రవేత్తల సిఫారసు ప్రకారం ఎకరానికి వరికి 2 బస్తాలు, మొక్కజొన్నకు 3 బస్తాలు, జొన్నకు 2 బస్తాలు, శనగకు ఒక బస్తా కేటాయిస్తారు. బుకింగ్‌ తర్వాత సమీప దుకాణాల్లో స్వీకరించవచ్చు.

యాప్‌ వినియోగం

మొబైల్‌లో యాప్‌ తెరిచి సిటిజన్‌ లాగిన్‌ ఎంపికలో మొబైల్‌ నంబర్‌, ఓటీపీ ద్వారా లాగిన్‌ అవ్వాలి. రాష్ట్రం, జిల్లా, సీజన్‌(రబీ, ఖరీఫ్‌), పాస్‌బుక్‌ నంబర్‌, పంటల వివరాలు నమోదు చేయాలి. ఆధారంగా బస్తాల సంఖ్య, 15 రోజుల్లో దశలవారీ సరఫరా వివరాలు కనిపిస్తాయి. పాస్‌బుక్‌ లేని కౌలు రైతులు ఆధార్‌తో నమోదు చేసుకోవచ్చు. బుకింగ్‌ ఐడీతో దుకాణంలో డబ్బు చెల్లించి ఎరువులు పొందాలి.

విడతల వారీగా సరఫరా

రైతులు ఒకేసారి కాకుండా విడతలు వారీగా యూరియా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయిదెకరాల్లో భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యూరియా బుకింగ్‌ యాప్‌లో పట్టా పాసుపుస్తకం నంబర్‌ నమోదు చేయగానే లింక్‌ చేసిన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏ పంట వేశారనే వివరాలతో పాటు ఆ పంటకు ఎంత యూరియా అవసరమనే సమాచారం, బుకింగ్‌ ఐడీ వస్తుంది. అనంతరం ఫర్టిలైజర్‌, సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బుకింగ్‌ కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది.

ఇబ్బందులు ఇలా

● రైతులందరి వద్ద స్మార్ట్‌ ఫోన్లు లేకపోవడం.

● నమోదుపై అవగాహన కొరవడటం, స్మార్ట్‌ ఫోన్లు ఉన్నా.. రీచార్జీ సమస్యలు తలెత్తడం.

● పల్లెల్లో సరైన నెట్‌వర్క్‌ లేకపోవడం.

● ఫోన్లకు తరుచూ వచ్చే సందేశాలకు ఎలా స్పందించాలో తెలియకపోవడం.

● దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్‌ మోసగాళ్లు విజృభించే అవకాశం లేకపోలేదు.

● ఫోన్‌ పే, గూగుల్‌ పేకు సంబంధించిన పిన్‌ నంబర్‌ ఇతరులకు చెప్పాల్సి రావడం.

అక్రమాలకు అడ్డుకట్ట

యూరియా విక్రయాల్లో అక్ర మాలను అరికట్టడం, నిజమైన రైతులకు సకాలంలో అందించడమే నూతన యాప్‌ లక్ష్యం. మోతాదుకు మించి వాడకానికి అడ్డుకట్టు పడటంతో పాటు భూసార పరిరక్షణ సాధ్యపడుతుంది. వ్యాపారులు, రైతులకు యూరి యా బుకింగ్‌ యాప్‌పై అవగాహన కల్పించాం.

– విజయచంద్ర, ఏఓ, షాబాద్‌

నూతన యాప్‌తోనే యూరియా పంపిణీ

అక్రమాల అడ్డుకట్టకు చర్యలు

రైతులు, డీలర్లకు అవగాహన

ఇష్టానుసారం వాడకానికి చెక్‌

సదస్సులు నిర్వహిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement