నిర్లక్ష్యం చేస్తే సహించం
ఇబ్రహీంపట్నం రూరల్: జీహెచ్‌ఎంసీని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిబట్ల సర్కిల్ కొంగరకలాన్, బొంగ్లూర్ ఔటర్‌సర్వీస్‌రోడ్డు సమీప ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లకు సూచించారు. నగర పారిశుద్ధ్య మెరుగుదలకు అన్ని స్థాయిల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రానున్న రోజుల్లో చెరువులు, నాలాలు, ఫుట్‌పాత్‌లు, పార్కుల క్లీనింగ్, వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ చంద్రకళ, డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్


