ఆగయా.. నయా సాల్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కాల చక్రంలో మరో వసంతం కనుమరుగయింది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. కొత్త ఆశలు.. కొంగొత్త ఆశయాలతో జిల్లా వాసులు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విందులు, వినోదాల్లో మునిగితేలిన వారంతా 2025కు వీడ్కోలు పలికారు. సరిగ్గా అర్థరాత్రి 11.59 నిమిషాలు దాటిన తర్వాత ఒక్క సారిగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టారు. కేకులు కట్ చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరూ.. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఇదే సమయంలో కొంత మంది యువతీ, యువకులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టామనే ఆనందంతో పాటు విషాదం కూడా జిల్లా వాసులను వెంటాడింది. డిసెంబర్ 31 పేరుతో రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా పీకలదాక మద్యం సేవించి వాహనాలపై ప్రయాణించి ప్రమాదాలకు గురయ్యారు. ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్న వారు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కారు. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం నేతలు ప్రణాళికలు రచిస్తుండగా, కాలం కలిసి రావాలని, పంటలు పుష్కలంగా పండాలని రైతులు, సంక్షేమ పథకాలు అందాలని ఆయా లబ్ధిదారులు ఆకాంక్షిస్తున్నారు. డిసెంబర్ చివరి మూడు రోజులు మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు ఎకై ్సజ్ జిల్లాలు ఉండగా, వీటి పరిధిలో 20 ఎకై ్సజ్ పోలీస్టేషన్లు ఉన్నాయి. 2023 డిసెంబర్ చివరి మూడు రోజుల(రూ.208.70 కోట్లు)తో పోలిస్తే... 2024లో రూ.75 లక్షలు తగ్గింది. మొత్తం రూ.207.95 కోట్లు వచ్చింది. అదేవిధంగా గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది.
భూభారతి సదస్సుల నిర్వహణ నాకు అంత్యంత సంతృప్తిని ఇచ్చింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం లభించడం సంతోషాన్ని కలిగించింది. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో రైతును నొప్పించకుండా, ఒప్పించి వారి నుంచి భూములు సేకరించాలని 2026కు టార్గెట్ పెట్టుకున్నా. వీలైనంత వరకు సాగుకు యోగ్యం కానీ భూములనే సేకరించాలని భావిస్తున్నా. ఎప్పటిలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను అర్హులకు అందజేయడమే లక్ష్యంగా పని చేస్తా. పరిపాలనలో పారదర్శకతను పెంచి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తా. జిల్లావాసులంతా లక్ష్యాలను నిర్ధేశించుకోవాలి. సవాళ్లను అధిగమించి, విజయాలను కై వసం చేసుకోవాలి. కొత్త సంవత్సరం ప్రతీ ఒక్కరికి గెలుపును అందించే సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తున్నా.
– నారాయణరెడ్డి, కలెక్టర్
ప్రశాంతమైన వాతావరణంలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించి, ఈ ఏడాది వందశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. అంతేకాదు ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఇవే ఫలితాలను పునరావృతం చేయాలని భావిస్తున్నాం. జనవరి నుంచి పదోతరగతి విద్యార్థులకు పునశ్ఛరణ తరగతులు నిర్వహించనున్నాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తాం.
– సుశీందర్‌రావు, జిల్లా విద్యాశాఖ అధికారి
ఆడపిల్లల ఆరోగ్యానికి అభయమివ్వడమే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యం. జనవరి రెండో వారంలో హెపీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మాకంగా ప్రారంభించబోతున్నాం. 14–15 ఏళ్లలోపు వయసున్న 1.17 లక్షల మంది బాలికలను ఇప్పటికే గుర్తించాం. వారందరికీ హెపీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తాం. అనైతిక వైద్య సేవలను నిఘా పెంచాం. వీటి తనిఖీలకు 45 బృందాలను సిద్ధం చేశాం. జిల్లా వ్యాప్తంగా 3,300 వైద్య సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డ్యూటీలో ఉండాల్సిందే. విధులకు గైర్హజరయ్యే వైద్య సిబ్బందిపై సీరియస్ యాక్షన్ ఉండబోతోంది.
– డాక్టర్ కె.లలితాదేవి, డీఎంహెచ్‌ఓ
2025కి ఘనంగా వీడ్కోలు.. 2026కు గ్రాండ్ వెల్‌కం
మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి నేతలు ప్రణాళికలు
కాలం కలిసి రావాలని రైతులు.. పథకాలు అందాలని ప్రజల ఆకాంక్ష
జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పినప్రజాప్రతినిధులు, అధికారులు


