నేడు మహాద్వార దర్శనం
నాలుగు వరుసల్లో దర్శనం
● చిలుకూరుకు తరలిరానున్న భక్తజనం
● భారీగా ఏర్పాటు చేస్తున్న అర్చకులు, పోలీసులు
మొయినాబాద్: నూతన సంవత్సరం మొదటి రోజు గురువారం చిలుకూరు బాలాజీ దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ప్రతీ సంవత్సరం జనవరి 1న సుమారు లక్షకు పైగా భక్తులు బాలాజీని దర్శనానికి విచ్చేస్తుంటారు. ఈ ఏడాది సైతం అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అర్చకులు, పోలీస్ శాఖ తగిన ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్, భక్తుల క్యూలైన్లుకు సంబంధించి తగిన ఏర్పాటు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు ఆలయ సమీసానికి వచ్చేలా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆలయ ప్రాంగణంతోపాటు బయట భక్తుల క్యూలైన్ల కోసం బారీకేడ్లు ఏర్పాటు చేశారు. స్వామి వారి దర్శనానికి నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులందరికీ మహాద్వార దర్శనం ఉంటుంది. గురువారం తెల్లవారు జామున 4గంటల నుంచే భక్తుల దర్శనానికి అనుమతించనున్నారు.
22 ఎకరాల్లో పార్కింగ్
చిలుకూరుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాలను గుర్తించారు. ఆలయ అర్చకులు, పోలీసులు కలిసి ఆలయ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి అందులో వాహనాలు పార్కింగ్ చేసేందుకు చదును చేయించారు. ఆలయం సమీపంలో సుమారు 22 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ అదనపు సర్వీసులు
నూతన సంవత్సరం మొదటి రోజు చిలుకూరు బాలాజీ ఆలయానికి టీజీఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రతి రోజు మెహదీపట్నం నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి 12 బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతీ 12 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది. గురువారం అదనంగా మరో పది బస్సులను 50 ట్రిప్పులు నడుపుతామని మెహదీపట్నం డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు.
భారీ బందోబస్తు
చిలుకూరు బాలాజీ ఆలయానికి గురువారం భారీ సంఖ్యలో భక్తులు తరలిరానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు వంద మంది పోలీసులతోపాటు మరో వంద మంది వలంటీర్లతో బందోబస్తు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు.
ప్రతి ఏడాది ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు జనవరి 1న చిలుకూరు బాలాజీని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశాం. మహా ప్రదక్షిణలు ఉండవు. భక్తులు నాలుగు వరసల్లో మహాద్వార దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశాం. –రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు


