ఇళ్ల కూల్చివేత వివాదాస్పదం
గర్భిణిని అని చెప్పినా వినలేదు
ఇక్కడ నుంచి కదలం
● అధికారులు కోర్టు స్టేను పట్టించుకోలేదని బాధితుల ఆవేదన
● తమ ప్లాట్లు, ఇళ్లు వదిలి వెళ్లేది లేదంటున్న గిరిజనం
మొయినాబాద్: అక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతల అంశం వివాదాస్పదంగా మారింది. కోర్టు స్టే(మధ్యంతర ఉత్తర్వులు) ఉండగానే మున్సిపల్ అధికారులు ఇళ్లు, ప్లాట్ల ప్రహరీలు కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2026 జనవరి 20 వరకు కోర్టు స్టే ఉందని.. మున్సిపల్ అధికారులు, పోలీసులు, బౌన్సర్లతో వచ్చి దౌర్జన్యంగా తమ ఇళ్లు కూల్చారని వాపోతున్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూ సర్వే నంబర్ 210, 211, 212లో ఉన్న 16 ఎకరాల భూమిని రాఘవేంద్ర సొసైటీ కొనుగోలు చేసి లేఅవుట్ చేసింది. 2019 నుంచి సొసైటీ సభ్యులు హర్షవర్ధన్‌రావు, హరికిరణ్ వద్ద సుమారు 50 మంది గిరిజనులు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇప్పటికే పది మంది ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన వారు తమ ప్లాట్ల చుట్టూ ప్రీకాస్ట్‌వాల్ నిర్మించుకున్నారు. అయితే ఇటీవల కొంత మంది ఈ భూమి తమదని.. ఇళ్లు, ప్లాట్లు ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించడంతో.. వెంటనే హైకోర్టును ఆశ్రయించగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని బాధితులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో వచ్చి తమ ఇళ్లను కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిద్రలేవకముందే పోలీసులు, బౌన్సర్లు ఇళ్లలోకి చొరబడి తమను బయటకు లాగేశారని.. బూతులు తిడుతూ తమ సెల్ ఫోన్లు లాక్కున్నారని బాధితులు వాపోయారు.
గిరిజనులనే టార్గెట్?
పెద్దమంగళారం రెవెన్యూలోని రాఘవేంద్ర సొసైటీలో ప్లాట్లు కొనుగోలుచేసి ఇళ్లు నిర్మించుకున్న గిరిజనులనే మున్సిపల్ అధికారులు టార్గెట్ చేశారు. పది ఇళ్లతోపాటు వారు కొనుగోలు చేసిన ప్లాట్ల చుట్టూ నిర్మించిన ప్రీకాస్ట్ వాల్స్ మాత్రమే కూల్చివేశారు. అదే సొసైటీలోని మిగిలిన ప్లాట్ల చుట్టూ వేసిన ఫ్రీకాస్ట్‌వాల్స్‌ను కూల్చకపోవడంపై బాధితులు గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నోటీసులు సైతం ఇవ్వకుండా రాత్రి వచ్చి ఇళ్లు కూల్చి తమను రోడ్డున పడేశారని ఆవేదన చెందారు.
రాత్రంతా బిక్కుబిక్కుమంటూనే..
ఇళ్లు కూల్చివేసినా బాధిత గిరిజనం రాత్రంతా అక్కడే పడిగాపులుకాశారు. చిలికి వణుకుతూ కూల్చిన ఇళ్ల ఎదుట పడుకున్నారు. రాఘవేంద్ర సొసైటీ ద్వారానే మేము ప్లాట్లు కొనుగోలు చేశామని.. ఎవరు వచ్చినా ఇక్కడి నుంచి కదిలేదని లేదని భీష్మించుకున్నారు. ఈ కూల్చివేతలపై బుధవారం బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు.
మొదటి నుంచి వివాదాస్పదమే
రాఘవేంద్ర సొసైటీ 1986లో రైతుల వద్ద భూములు కొనుగోలు చేసి లేఅవుట్ చేసి కొంత మందికి ప్లాట్లు విక్రయించింది. సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రంగారెడ్డి 1998లో ఈ భూమిని శ్రీనివాస్‌రాజు, సురేశ్‌రెడ్డికి అగ్రిమెంట్ చేశాడు. రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లిన శ్రీనివాస్‌రాజు, సురేశ్‌రెడ్డి 2011 డిక్రీ తెచ్చుకుని కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి నుంచే రాఘవేంద్ర సొసైటీ భూములపై వివాదం కొనసాగుతోంది. లేఅవుట్‌లో ముందుగా ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఇతరులకు విక్రయించడంతో చేతులు మారాయి. ఈ క్రమంలోనే 2019 నుంచి గిరిజనులు ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.
మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం
గిరిజనుల ఇళ్లు కూల్చడంలో మొయినాబాద్ మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు స్పష్టమవుతుంది. కోర్టు ఉత్తర్వులతో కూల్చివేతలు చేపట్టామని చెప్పిన అధికారులు వాటిని మీడియా చూపడం లేదు. మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, టౌన్‌ప్లానింగ్ అధికారి వాణి కూల్చివేతలకు సంబంధించిన విషయాలను మీడియా ప్రతినిధులకు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రతిని చూపించాలని మీడియా ప్రతినిధులు కోరగా సమాదానం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. అధికారుల తీరును బట్టి చూస్తే కూల్చివేతల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
షాద్‌నగర్ నియోజకవర్గం చౌదరిగూడలో భూమిని అమ్ముకుని రెండేళ్ల క్రితం ఇక్కడ వంద గజాల ప్లాటు కొని ఇల్లు కట్టుకున్నాం. మంగళవారం తెల్లవారు జామున నిద్రలేవకముందే పోలీసులు, బౌన్సర్లు ఇళ్లలోకి వచ్చి భయబ్రాంతులకు గురిచేశారు. నేను గర్భిణిని అని చెప్పినా బలవంతంగా బయటకు లాగేశారు. సెల్‌ఫోన్లు గుంజుకున్నారు. పిల్లలను బయటకు లాగేసి జేసీబీతో ఇళ్లు కూల్చివేశారు.
– నందిని, బాధితురాలు
లక్షలు పెట్టి ప్లాట్లు కొన్నాం.. ఇళ్లు కట్టుకున్నాం. విద్యుత్ కనెక్షన్లు, ఇంటి నంబర్లు ఇచ్చారు. అధికారులు, పోలీసులు రాత్రి సమయంలో వచ్చి కూల్చివేయడం సరికాదు. మేం ప్రభుత్వ భూమిని ఆక్రమించామా..? ఇళ్లు కూల్చివేసినా మేము ఎక్కడికీ వెళ్లం.
– చందు, బాధితుడు
ఇళ్ల కూల్చివేత వివాదాస్పదం


