కూటమి, మోసం.. రెండూ కవల పిల్లలు: ఆర్కే రోజా | YSRCP RK Roja Satirical Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

కూటమి, మోసం.. రెండూ కవల పిల్లలు: ఆర్కే రోజా

Nov 21 2025 1:24 PM | Updated on Nov 21 2025 1:41 PM

YSRCP RK Roja Satirical Comments On CBN Govt

సాక్షి, తాడేపల్లి: మోసం, కూటమి ప్రభుత్వం రెండూ కవల పిల్లలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేస్తోందన్నారు. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులను ఆదుకోవాలని రోజా డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్‌ వేదికగా..‘సొంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మామిడి రైతులకు అండగా ఉండటం కోసం బంగారుపాలెం పర్యటన చేశారు. జగనన్న వస్తుండటంతో భయపడ్డ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులను తప్పుదోవ పట్టించడానికి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి 45 వేల మంది రైతులు పండించిన 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ప్యాక్టరీలకు తోలారు.

అప్పుడు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క కిలోకు ప్రభుత్వం 4 రూపాయలు ప్యాక్టరీలు 8 రూపాయలు మొత్తం కిలో మామిడికి 12 రూపాయలు ఇస్తామని చెప్పారు. నెలలు గడిచినా ప్రభుత్వం ఇవ్వాల్సిన 180 కోట్లు, ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు విడుదల చేయలేదు. రైతు సంఘాలు ఆందోళన చేయడం వారికి అండగా నా వంతు బాధ్యతగా నేను కూడా రైతుల ఆందోళనకు అండగా నిలబడ్డాను. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన 180 కోట్లు విడుదల చేశారు. అయితే, ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతుండటంతో ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు ఇవ్వకపోతే రైతులకు మద్దతుగా పోరాటం చేశామని నేను మాట్లాడిన విషయం మీకు తెలిసిందే.

తాజాగా ప్రభుత్వం ప్యాక్టరీ యాజమాన్యం ఇవ్వాల్సిన 8 రూపాయలు కాకుండా ప్రభుత్వం ఇచ్చినట్లే 4 రూపాయలు ఇస్తుంది. కొన్ని చోట్ల మూడు రూపాయలు కూడా ఇస్తున్నారని కూడా రైతులు తమ బాధను నాకు చెప్పినప్పుడు చాలా బాధేసింది. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో.. ప్రభుత్వ మోసం వల్ల 45 వేల మంది రైతులు 180 కోట్లు నష్ట పోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు కిలోకు 8 రూపాయల చొప్పున 360 కోట్లు ఇవ్వాలని మామిడి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తమ న్యాయమైన డిమాండు కోసం మామిడి రైతులు చేసే పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఎప్పటిలాగే ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement