సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు కుటుంబ సభ్యులు ఐదు వేల కోట్లు భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని బొత్స వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఎంపీ భరత్ ప్రభుత్వ భూమి ఏ విధంగా కబ్జా చేస్తాడని ప్రశ్నించారు.
శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖలో భూ బదలాయింపు అంశం రేపు(గురువారం) జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో 15వ ఐటమ్‌గా చేర్చారు. భూ దోపిడిని ఆపాలని మేయర్, సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించాం. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. రేపు గీతం యూనివర్సిటీలో కబ్జాకి గురైన 5 వేల కోట్ల విలువైన భూమిని సందర్శిస్తాను. ఈనెల 30వ తేదీన కౌన్సిల్లో పోరాటం చేస్తాం. అదే రోజు గాంధీ విగ్రహం ముందు నిరసన చేపడతాం.
విశాఖ భూ దోపిడీపై జనసేన, బీజేపీ సమాధానం చెప్పాలి. ఐదు వేల కోట్ల విలువైన భూమిని కాపాడటంపై మీ స్పీడ్ చూపించాలి. పవన్ కళ్యాణ్ ప్రతిరోజు నీతి కబుర్లు చెబుతారు. విశాఖ భూ దోపిడీపై ఎందుకు మాట్లాడలేదు?. సెంటు, రెండు సెంట్లు క్రమబద్ధీకరణ చేయడం కోసం ఎన్నో ఇబ్బందులు పెడతారు. 55 ఎకరాల భూమిని ఎలా క్రమబద్దీకరణ చేస్తారు?. వామపక్షాలు, పార్టీలతో కలిసి పోరాటం చేస్తాం. గీతం విద్యా సంస్థ ఒక దోపిడీ సంస్థ. విద్యార్థుల నుంచి సీట్లు కోసం కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే 79 ఎకరాలను గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరణ చేశారు. 1998 నుంచి దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.
మరోవైపు.. విశాఖ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ..‘అధికారం చేతిలో ఉంది కదా అని గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల భూములు కేటాయిస్తున్నారు. ఈ భూ కేటాయింపు అన్యాయం. ఎంపీ భరత్‌కు 55 ఎకరాల భూమి కేటాయించడం అప్రజాస్వామ్యం. విశాఖలో భూములను పప్పు బెల్లాలులా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల భూములను తమకు నచ్చిన వారికి కట్ట పెట్టారు. జీవీఎంసీ ఎజెండా నుంచి గీతం అంశాన్ని తొలగించాలని వినతి పత్రం సమర్పించాం. విశాఖలో జరుగుతున్న భూ దోపిడిపై మేధావులు విద్యావంతులు ఆలోచించాలి. ఉత్తరాంధ్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.


