
సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుది అంతా పబ్లిసిటీ స్టంట్. చంద్రబాబు పీ-4 పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్‌డ్ ఏప్రిల్ ఫూల్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. సంపద ఏమైంది?. రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు. గత ప్రభుత్వ పథకాలను పాతరేశారు. కొత్త పథకాల ఊసేలేదు. రాష్ట్రంలోని పేద ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నారు. డబ్బులు ఉన్నోడికే మెడికల్ సీట్లు దోచిపెడుతున్నారు. నీతి, నిజాయితీకి మారు పేరు అంటే చంద్రబాబు ఎవరైనా నమ్ముతారా?. బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. పీ-4 అంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
పీ-4 పేరుతో కొత్త నాటకం..
చంద్రబాబు నాయుడు పీ-4 పేరుతో కొత్త నాటకాన్ని ప్రారంభించాడు. పీ-4కు మార్గదర్శి బంగారు కుటుంబం అని కొత్త పేరు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు పీ-4 దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొత్తగా టోల్ గేట్లు పెడతానని చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామీణ ప్రాంత రోడ్డును చంద్రబాబు నాయుడు ప్రైవేటుపరం చేస్తున్నాడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లను ప్రైవేటీకరణ చేశాడు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సంపద సృష్టిస్తానని చెప్పాడు. పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
పేదరిక నిర్మూలన కావాలంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకానీ కాంట్రాక్టర్లను, డబ్బులు ఉన్నవారిని, బడా బాబుల్ని పీ-4 పేరుతో వేదికపైన కూర్చోబెడితే పేదరికం పోదు. ఈ రాష్ట్రంలో రెండే రెండు బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబుది, రెండోది పవన్ కళ్యాణ్‌ది. ఈ రెండు బంగారు కుటుంబాలే. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి అన్నాడు.. శ్రమదానం అన్నాడు అవన్నీ పోయాయి. ఇప్పుడు పీ-4 పేరు చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు.
చంద్రబాబు నాయుడు నేనేం తప్పు చేయనని డప్పు కొట్టుకుంటున్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసేవన్నీ తప్పులే. ఎన్టీఆర్ దగ్గర పని చేశారని చంద్రబాబు చెప్తున్నాడు. ఆయన ఇందిరా గాంధీ దగ్గర పని చేశాడు.. ఎన్టీఆర్ పని పూర్తి చేశాడు. లోకేష్ లాంటి అసమర్ధుడిని ప్రజలపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉన్నవాళ్లు ఉన్నారు. ఎనిమిది లక్షల అరవై వేల మంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్లని వాళ్లతో ఎలా అనుసంధానం చేస్తాడు?.

పవన్ ప్యాకేజీ స్టారే..
పవన్ కళ్యాణ్ నేను అసమర్థున్ని అని మనసులో మాట బయటపెట్టారు. పవన్ మాటలను జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆలోచించాలి. లోకేష్ డబ్బులు వసూలు చేసి పవన్‌కి ప్యాకేజీ ఇస్తున్నాడు. పేదల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను.. ఐటీ నేనే తెచ్చానని పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నాడు. డబ్బులు కోసం పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారు. పోలవరంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు వచ్చినా.. ఆయన మంత్రులను పంపించినా చర్చకు నేను సిద్ధం. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని ఎప్పటినుంచో అడుగుతున్నాను. కానీ, తెలుగుదేశం నాయకులు గానీ చంద్రబాబు గానీ.. ఎవరు సమాధానం చెప్పడం లేదు ఎందుకు?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి. చంద్రబాబు తెలిపి తక్కువ వల్లే పోలవరం ఆలస్యమైంది. పోలవరంపై చర్చకు ఎప్పుడైనా సిద్దమే. స్పిల్ వే, కాఫర్ డ్యామ్ పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌సీపీదే. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ వేస్తారా? అని ప్రశ్నించారు.