
సాక్షి, తాడేపల్లి: రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునకు కారణమైందని వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆక్షేపించారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి మురళీకృష్ణ చెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:
చోద్యం చూస్తున్నారు:
ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్ చేయించకుండా చోద్యం చూడటం బాధాకరం. పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరమైతే పొలాలను రియల్ వెంచర్లుగా మార్చి రూ.3 వేల కోట్లు దోచుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర కుట్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదని భావిస్తున్న నరేంద్ర, నియోజకవర్గ రైతాంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.
ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. మరో వైపు రాజధాని అమరావతి కోసం పొన్నూరు రైతులను కొండవీటి వరదనీటితో ముంచారు. పంటలు నీటమునిగి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా మంత్రులు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ పొలాల వైపు కన్నెత్తి కూడా చూసిన పాపానపోవడం లేదు. పంట నష్టంపై అధికారులను నివేదిక కోరినట్టు కూడా ఎక్కడా వార్తలు కూడా లేవు. రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టు వారి సమస్యలు అసలు సమస్యలే కావన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

పొన్నూరులో 72 వేల ఎకరాల్లో పంట నష్టం:
పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ 17 కి.మీ మేర ప్రవహిస్తుంది. గుంటూరు ఛానల్‌కు గత ఏడాది గండ్లు పడ్డాయి. దాంతో ఇప్పుడు వరదనీటికి గండ్లు తెగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని రైతులు కోరినప్పుడు నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పాడు. కానీ పంట కాలువల్లోని నల్ల మట్టిని తెచ్చి ఆ గండ్లు పూడ్చేయించాడు. తూటికాడు తీయమంటే గడ్డి మందు స్ప్రే చేసి వదిలేశారు. దీనికి సాగునీటి సంఘాలు రూ.24 లక్షల బిల్లులు పెట్టుకున్నాయి. ఎండినట్టే ఎండి మళ్లీ వర్షాలతో గడ్డి పెరిగిపోయిండి. వర్షాలకు ఈ తూటికాడు తూములకు అడ్డం పడి నంబూరు దగ్గర కాలువలకు మూడు గండ్లు పడ్డాయి.
ఒక్క కాకాణి వద్దనే 11 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులే చెబుతున్నారు. చేబ్రోలు మండలంలో 15 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంటే అందులో 5 వేల ఎకరాలు నీట మునిగాయి. పొన్నూరు మండలంలో 28 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు మునిగిపొయాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. (అంటూ ప్రెస్‌మీట్‌లో ఆ ఫోటోలు చూపారు)
సమస్యపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళితే చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే ఆలోచన వారిలో కనిపించలేదు. గత ఏడాది గుంటూరు ఛానల్, కృష్ణా వెస్ట్ ఛానల్, హైలెవల్ ఛానల్, అప్పాపురం ఛానల్ పరిధిలో మొత్తం 237 గండ్లు పడి 74వేల ఎకరాల మాగాణి, 30 వేల ఎకరాల ఉద్యానవన పంటలు కొట్టుకుపోయాయి. ఈ ఏడాది ఇప్పటికే 72వేల ఎకరాల్లో పంట వరద ముంపునకు గురైనట్టు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కడా ఎన్యుమరేషన్ కి ఆదేశించలేదు.

పొన్నూరును ముంచెత్తిన అమరావతి వరద:
నంబూరు గ్రామంలో గతంలో ఉత్సవాల కోసం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, 18 వేల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు అల్లాడిపోతుంటే కనీసం పరామర్శించలేదు. నిజానికి ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం అమరావతి ముంపును తగ్గించడం కోసం ప్రభుత్వం కొండవీటి వాగుకు పంపులు పెట్టి గుంటూరు ఛానల్, కృష్ణా ఛానల్, అప్పాపురం ఛానల్‌లోకి మళ్లిస్తోందని రైతులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రూ.3 వేల కోట్ల దోపిడీకి ధూళిపాళ్ల స్కెచ్:
గుంటూరు – బాపట్ల ప్రధాన రహదారిని నేషనల్ హైవేగా మార్చి ఫోర్ వేగా అభివృద్ధి మార్చాలని చూస్తున్నారు. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో కట్టిన చేబ్రోలు–కొమ్మమూరు బ్రిడ్జిని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర పునర్‌నిర్మాణం చేయాలని అనుకోలేదు. నాడు జగన్ సీఎం అయ్యాక రూ.45 కోట్లకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను నియమించి బ్రిడ్జి పనులు మొదలుపెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలలుగా ఈ పనులు పక్కన పడేశారు.
కాంట్రాక్టర్‌ను రూ.5కోట్లు కమీషన్లు కట్టాలని డిమాండ్ చేయడంతో పనులు వదిలేసి వెళ్లిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదలతో రోడ్డు సగం కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జి కనుక కూలిపోతే రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గత నెలన్నర కాలంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో జాడ లేకుండా పోయాడు.
నంబూరు రైతులు తమ గోస వినిపించాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే అవి పంటలు పండే పొలాలు కాదని, లేఅవుట్లుగా మార్చుకోవాలని ఉచిత సలహాలిస్తున్నాడని వారు వాపోతున్నారు. రాజధానికి దగ్గరగా ఉన్న 30 వేల ఎకరాలను లేఅవుట్లుగా మార్చితే ఎకరాకు రూ.10 లక్షల వంతున వసూలు చేసి రూ.3 వేల కోట్లు సొమ్ము చేసుకోవచ్చనేది ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు.