
సాక్షి, విజయవాడ: మూడు నెలల్లో పెండింగ్ బకాయిలు క్లీయర్ చేయకపోతే పోరుబాట పడతామని చంద్రబాబు సర్కార్‌ను ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరించింది. ఇవాళ(శనివారం) కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై మా వైఖరీలో ‘‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’’ అంటూ తేల్చి చెప్పింది. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. ఏడాది దాటినా కానీ.. సీఎం, కేబినెట్ ఉపసంఘం మాతో చర్చించలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. జూన్‌లో జరగాల్సిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆగస్టులో జరిగాయి. ఏ అంశం పరిష్కారం కాలేదు’’ అని ఆయన మండిపడ్డారు.
‘‘ఒక్కో ఉద్యోగికి మూడు నుండి 5లక్షలు, రిటైర్డ్ ఉద్యోగులకు 15 నుండి 20 లక్షలు బకాయిలు ఉన్నాయి. సీఎస్ఎంఎఫ్‌లో సంబంధం లేకుండా ప్లే స్లిప్‌లో మా బకాయిలు చూపించాలి. నాలుగు డీఎలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏ, ఐఆర్ కోల్పోవడం, బకాయిలు ఇవ్వకపోవడంతో వేల కోట్లు నష్టపోయాం. మా హక్కును మేం అడుగుతున్నాం. మూడు నెలల్లో బకాయిలు చెల్లించకపోతే పోరుబాట పడతాం’’ అని బొప్పరాజు చెప్పారు.
ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ.. ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చానని చెప్పిన పవన్ ఇప్పుడు మాట్లాడటం లేదు. 2023 నుంచి ఐఆర్ రావాలి. వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కరించకుంటే ఎటువంటి ఉద్యమాకైన సిద్ధం. ప్రభుత్వ స్థలాలు, ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తే సంపద సృష్టి జరగదు.