
విజయవాడ: కృష్ణా, కర్నూలు జిల్లాల గ్రామ వ్యవసాయ సహాయకులు బదిలీలు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీఏఏల బదిలీ వ్యవహారంపై హైకోర్టు విస్మయం వ్యకతం చేసింది. ఆ రెండు జిల్లాల్లో తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
నిబంధనలకు పాతరేసి ప్రజాప్రతినిధుల సిఫార్సులకు అధికారులు పట్టంకట్టి బదిలీలు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇవి ప్రజా ప్రతినిధుల సిఫార్సు మేరకే జరిగాయని, దీన్ని ప్రజా ప్రయోజనంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. బదిలీల అమల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా కలెక్టర్ మౌనంగా ఉండిపోయారని, బదిలీల్లో పారదర్శకత లోపించిందని హైకోర్టు తేల్చి చెప్పింది.