
పోలీసుల చర్యలు దారుణంగా, అత్యంత ఆక్షేపణీయంగా ఉన్నాయి
పోలీసుల విశ్వసనీయతపై మాకు ప్రాథమిక అనుమానాలున్నాయి
వాస్తవాలకు, పోలీసులు చెబుతున్న దానికి పొంతన కుదరడం లేదు
ఏక పక్షంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు
అందుకే మాకున్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నాం
ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం
అప్పటి వరకు సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే ప్రక్రియ నిలిపివేత.. సీబీఐ దర్యాప్తునకు ఇచ్చేంత, సౌందరరెడ్డి అరెస్ట్ అక్రమం అనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి
గంజాయి కేసులో సౌందరరెడ్డిని ఇరికించారు
తమ చట్ట విరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా చేశారు
అందుకే మేం ఈ కేసులో జోక్యం చేసుకుంటున్నాం.. రిమాండ్ రిపోర్ట్‌లో రాత్రి 8.30కి అరెస్ట్ చేశామన్నారు
అదే రిపోర్టులో 7.30కే మధ్యవర్తుల నివేదిక సిద్ధం చేశామన్నారు.. ఇదెలా సాధ్యం?
ఆయన సెల్‌ఫోన్ తాడేపల్లి వద్ద 6.21 గంటలకు స్విచాఫ్ అయినట్లు జియో చెప్పింది..
రాత్రి 7 గంటలకు సౌందరరెడ్డి భార్య తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు
విచారించాల్సిన వ్యక్తుల్లో రాష్ట్ర పోలీసులున్నందునే సీబీఐకి అప్పగిస్తున్నామన్న హైకోర్టు
తదుపరి విచారణ 13కు వాయిదా
సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా అరెస్ట్ చేసిందే కాక.. అదుపులోకే తీసుకోలేదని పోలీసులు మాకు చెప్పారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదన్నారు. ఆయన భార్య ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. మళ్లీ అరెస్ట్ చేశామని, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలంటున్నారు.
ఈ కేసులో అరెస్ట్ చేసిన సమయం, పోలీసులు చెబుతున్న విషయాలు పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వాస్తవాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. పోలీసుల తీరు తీవ్ర ఆక్షేపణీయం. అందువల్ల వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలగకూడదని కేసు లోతుల్లోకి వెళ్తున్నాం. అధికరణ 226 కింద ఉన్న అసాధారణ అధికారాన్ని ఉపయోగిస్తున్నాం. –హైకోర్టు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందరరెడ్డి అలియాస్ సవీందర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌పై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందులో భాగంగా సీబీఐ ఏపీ విభాగాధిపతిని సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి, ప్రాథమిక నివేదికను తమ ముందుంచాలని ఆయన్ను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే ప్రక్రియను ఆపేసింది. సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన ప్రాథమిక ఆధారాలు ఈ కేసులో ఉన్నాయంది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సౌందరరెడ్డి అరెస్ట్ అక్రమమనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘గంజాయి కేసులో సౌందరరెడ్డిని పోలీసులు ఇరికించారు. పోలీసులు వారి చట్టవిరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేశారు. తగిన అరెస్ట్ వారెంట్ లేకుండా, సుప్రీంకోర్టు నిర్దేశించిన అరెస్ట్ విధానాన్ని అనుసరించకుండా సౌందరరెడ్డిని అరెస్ట్ చేశారు.
అలాగే అధికారుల విశ్వసనీయతపై కూడా మాకు సందేహాలున్నాయి. అందుకే ఈ కేసులో జోక్యం చేసుకుంటున్నాం. అన్యాయంగా, ఏకపక్షంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. ఈ కేసులో పోలీసుల చర్యలు చాలా దారుణంగా ఉన్నాయి’ అని ధర్మాసనం వివరించింది.
8.30కి అరెస్ట్ చేస్తే.. 7.30కే మధ్యవర్తుల నివేదిక ఎలా సాధ్యం?
‘సౌందరరెడ్డిని ఈ నెల 22వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో అరెస్ట్ చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అదే రిపోర్టులో 7.30 గంటలకు మధ్యవర్తుల నివేదిక సిద్ధం చేసినట్లు పోలీసులు చెప్పారు. మరి 8.30 గంటలకు అరెస్ట్ చేస్తే, 7.30 గంటలకే ఎలా మధ్యవర్తుల నివేదిక సిద్ధం అవుతుంది? అలాగే తనను 22వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు అరెస్ట్ చేశారని సౌందరరెడ్డి మాకు చెప్పారు.
సౌందరరెడ్డి సాయంత్రం 4.20 గంటలకు విజయవాడలో ఉన్నారని, అనంతరం అక్కడి నుంచి కుంచనపల్లికి వెళ్లారని కూడా జియో కంపెనీ తన మెమోలో ఈ కోర్టుకు చెప్పింది. ఆ తర్వాత సాయంత్రం 6.21 గంటలకు అతని ఫోన్ స్విచాఫ్ అయినట్లు కూడా జియో చెప్పింది. అటు తరువాత 7 గంటలకు సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా జనరల్ డైరీలో నమోదు చేశారు. 7.30 గంటల కన్నా ముందే ఆమె తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని అర్థమవుతోంది. సౌందరరెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు చెబుతున్న దానికీ, వాస్తవంగా జరిగిన దానికీ పొంతన కుదరడం లేదు. పోలీసులు చెబుతున్న విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలగకూడదనే జోక్యం
‘ఓ వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండి తీరాలని డీకే బసు కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాక వారి గుర్తింపును సైతం తెలియచేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో పోలీసులు సౌందరరెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో యూనిఫాంలో లేరు. ఇదే విషయాన్ని ప్రత్తిపాడు సీఐ ధ్రువీకరించారు.
సాధారణంగా మేము ఇలాంటి కేసుల్లో లోతుల్లోకి వెళ్లం. అయితే పోలీసుల తీరు అత్యంత ఆక్షేపణీయంగా ఉండటంతో లోతుల్లోకి వెళ్లక తప్పలేదు. సౌందరరెడ్డి స్వేచ్ఛకు విఘాతం కలగకూడదనే మేం జోక్యం చేసుకుంటున్నాం. అధికరణ 226కింద ఉన్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నాం. ఓ వ్యక్తి అరెస్ట్ సక్రమమైనప్పుడే అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం సాధ్యమవుతుంది’ అని జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం స్పష్టం చేసింది.
...అందుకే సీబీఐకి అప్పగిస్తున్నాం
‘సౌందరరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసుల విశ్వసనీయతపై మాకు ప్రాథమిక అనుమానాలున్నాయి. అందుకే అధికరణ 226 కింద జోక్యం చేసుకుంటున్నాం. అంతేకాక వ్యక్తి స్వేచ్ఛను హరించకుండా అడ్డుకునేందుకు ఈ అధికరణ కింద మాకున్న అధికారాన్ని ఉపయోగించకుండా ఎవరూ నిరోధించలేరు. ప్రస్తుత కేసులో లేవనెత్తిన విషయాలను, అలాగే విచారించాల్సిన వ్యక్తుల్లో రాష్ట్ర పోలీసు అధికారులు ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాం.
అందుకే ఈ వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ సీబీఐ విభాగాధిపతిని ప్రతివాదిగా చేరుస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి మాకు ప్రాథమిక నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశిస్తున్నాం. సీబీఐ ప్రాథమిక నివేదిక ఇచ్చేంత వరకు సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడాన్ని నిలిపేస్తున్నాం’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది.
సౌందరరెడ్డి టవర్ లొకేషన్ డేటా, తాడేపల్లి పోలీస్‌స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ, పోలీసుల రిమాండ్ రిపోర్టు, తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదుదారు లక్ష్మీ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదులను సీల్డ్ కవర్‌లో ఉంచామని, వాటిని సీబీఐ దర్యాప్తు అధికారికి అందజేయాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఆదేశిస్తున్నామని పేర్కొంది.
తన భర్తను అక్రమంగా నిర్బంధించారంటూ పిటిషన్
తన భర్త సౌందరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ కుంచాల లక్ష్మీప్రసన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. సౌందరరెడ్డిని తాము అదుపులోకి తీసుకోలేదని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో ధర్మాసనం.. సౌందరరెడ్డి ఎక్కడున్నా కూడా వెతికి తమ ముందు హాజరుపరచాలని, అతన్ని ఏ కేసులో కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదని పోలీసులను ఆదేశించింది.
అంతేకాక సౌందరరెడ్డిని అపహరించారంటూ లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెబుతున్న నేపథ్యంలో ఈ నెల 22 సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అలాగే 22న సాయంత్రం సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియజేసేందుకు వీలుగా అతని సెల్ టవర్ వివరాలను ఇవ్వాలని జియో ఫోన్ జనరల్ మేనేజర్‌ను సైతం ఆదేశించిన విషయం తెలిసిందే.
మొదటి నుంచీ తప్పుదోవ పట్టించిన పోలీసులు
తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచీ కోర్టును తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నారని తెలిపారు. సౌందరరెడ్డి అక్రమ నిర్బంధంపై తాము 23న పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై ఈ ధర్మాసనం సాయంత్రం 4 గంటలకు విచారణ జరిపిందన్నారు.
ఈ సందర్భంగా పోలీసులు అసలు సౌందరరెడ్డిని తాము అరెస్ట్ చేయలేదని, ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదని ఈ కోర్టుకు చెప్పారన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా పోలీసులు సౌందరరెడ్డిని అదే రోజు సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని ఆయన వివరించారు. దీన్నిబట్టి ఈ కేసులో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని ఆయన కోర్టును కోరారు.
మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాం.. అనుమతించండి
ఈ సమయంలో పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమాను విష్ణుతేజ స్పందిస్తూ, సౌందరరెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తీరాల్సి ఉందని, ఇది తమ బాధ్యత అని తెలిపారు. సౌందరరెడ్డిని స్వేచ్ఛగా వదిలేయాలన్న హైకోర్టు ఆదేశాల వల్ల అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఈ ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు.
అంతిమంగా రిమాండ్ విషయంలో మేజిస్ట్రేటే తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసు దాఖలైన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ రికార్డ్ చేసింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు దారి తీసిన పరిస్థితులను కూడా వివరించింది. అనంతరం దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఏమాత్రం మారని ఖాకీల తీరు!
18122024
మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు..
‘సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపలేదు. అయినా కింది కోర్టు మేజిస్ట్రేట్ ఆధారాలున్నాయనడం తప్పు. మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్‌కు గల కారణాలను చెప్పలేదు..’ – సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకట రమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.
06012025
కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా..?
‘సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించి మేం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వాలి. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్ చూపారు? ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు కావాలి. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి తీరును సహించేది లేదు. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా? కడప ఎస్పీ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..!’ – వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై ఆయన భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు
18022025
లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు?
‘వ్యక్తులపై కేసులు పెట్టడం.. వారిని కొట్టడం.. లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టి లోపల వేయడం మినహా ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదు. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలను మా ముందు ఉంచేవారు.
దర్యాప్తు చేయలేదు కాబట్టే ఏ వివరాలను సమర్పించలేదు. అతడిపై 27 కేసులున్నాయని చెబుతున్నారు. కానీ, ఆ కేసుల దర్యాప్తు వివరాలను మా ముందు ఉంచడంలేదు. మా ఆదేశాలపై డీజీపీ ఏ చర్యలు తీసుకున్నారు..?’ – విశాఖకు చెందిన బొసా రమణ అరెస్టుపై ఆయన భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు
25022025
పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు..
‘పోలీసులు వాస్తవాలను దాచిపెడుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. బొసా రమణ అరెస్టు విషయంలో డీజీపీ నివేదిక ఇస్తారని ఆశించాం. కానీ, ఎలాంటి నివేదిక రాలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని డీజీపీని నివేదిక కోరాం. డీజీపీ పోస్టుపై ఉన్న గౌరవంతో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వలేదు.
రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామని డీజీపీ భావిస్తే అలాగే ఆదేశాలు ఇస్తాం. రమణ అరెస్టు విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్ నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి...’ – బొసా రమణ భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.
11032025
‘పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం..
‘పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోం. ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. రుజువు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? తాము చట్టం కంటే ఎక్కువని పోలీసులు భావిస్తున్నారు. చిన్న తప్పులేనని వదిలేస్తే.. రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టు చేస్తారు. ప్రతి దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు..’ – సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు విధించినరిమాండ్ చట్ట విరుద్ధమని కొట్టేసిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
25032025
హద్దు మీరొద్దు
‘తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతోంది. – మాదిగ మహాసేన అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై హైకోర్టు వ్యాఖ్యలు
10042025
ఇది ధిక్కారమే...
హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండాపోయింది. సెక్షన్ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నట్లు కాదా?’ – పోసాని కృష్ణమురళిపై కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి
1932025
సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా?
సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్‌ఎస్ సెక్షన్–111 ప్రకారం ఆరి్థక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలు ఉండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలం? – సజ్జల భార్గవ్, సింగిరెడ్డి అర్జున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు
2142025
పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు అందరం ఇబ్బందిపడతాం
చట్టాన్ని బేఖాతర్ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేకా ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారని తల్లిదండ్రులను వేధిస్తారా? – తిరుపతికి చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి సుబ్రహ్మణ్యరెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం
2972025
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే సహించం
‘‘తప్పుడు కేసులతో పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి చేస్తారో... ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదని అనుకోవద్దు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే సహించం. కౌన్సెలింగ్ పేరుతో పౌరులను వేధింపులకు గురి చేస్తే.. మీకు కౌన్సెలింగ్ చేయించాల్సి ఉంటుంది. – పఠాన్ కురీంసా(పిడుగురాళ్ల) అనే వ్యక్తి అక్రమ నిర్బంధం కేసు విచారణ సందర్భంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ సీఐపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

682025
ఆరేళ్ల కిందట ఘటన జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా?
ఆరేళ్ల కిందట ఘటన జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? వైఎస్సార్‌సీపీ నేత తురకా కిశోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ అయిన వ్యక్తి ఒక్క క్షణం కూడా జైలులో ఉండటానికి వీల్లేదు. అక్రమ నిర్బంధాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. – మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కిశోర్ అక్రమ అరెస్ట్‌పై ఆయన భార్య సురేఖ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
2982025
సివిల్ దుస్తుల్లో పోలీస్ విధులా?
పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారు? పోలీసు యూనిఫాంలో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అది డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం. సివిల్ దుస్తుల్లో వస్తే వారు పోలీసులని ఎలా తెలుస్తుంది? సివిల్ దుస్తుల్లో వచ్చి తమ విధులను అడ్డుకున్నారంటే ఎలా కుదురుతుంది? సివిల్ దుస్తుల్లో పోలీసులు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తామంటే కదరదు.
అసలు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించే ప్రివిలేజీలేవీ పోలీసులకు లేవు. – మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా స్పష్టం చేసిన హైకోర్టు
అరెస్ట్ .. రిమాండ్ ఇష్టారాజ్యం కాదు
నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల అరెస్ట్ అవసరమా? కాదా? అనే విషయంలో పోలీసులు, మేజిస్ట్రేట్లు తగిన ఆలోచన, పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు అర్నేష్‌కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు 2014లోనే స్పష్టత ఇచ్చింది. తాజాగా అదే తీర్పును ఉటంకిస్తూ అరెస్టులు, రిమాండ్‌లు యాంత్రికంగా కాకుండా, న్యాయబద్ధమైన విచక్షణతో జరగాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ కింది కోర్టులకు ఏపీ హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది.
పౌర స్వేచ్ఛపై ‘సుప్రీం’ ఏం చెప్పిందంటే...
» ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు..
» స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడటం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది.
భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి.
– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో ‘సుప్రీం కోర్టు’ కీలక వ్యాఖ్యలు