
2015 సంవత్సరానికి 2022లో ఇచ్చిన సీనియారిటీ జాబితా రద్దు చేసిన హైకోర్టు
తాజా సీనియారిటీ జాబితాను తయారుకు రిజిస్ట్రీకి ఆదేశాలు
ఇందుకు 4 నెలల సమయం
అప్పటి వరకూ ఎలాంటి పదోన్నతులు ఇవ్వరాదని నిర్దేశాలు
దీంతో జిల్లా జడ్జీల పదోన్నతుల విషయంలో కీలక మార్పులు
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో జిల్లా జడ్జీల అంతర్గత సీనియారిటీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015 సంవత్సరానికిగాను 2022 జనవరి 5న జారీ చేసిన సీనియారిటీ జాబితాను రద్దు చేసింది. 10 శాతం బదిలీ ద్వారా వేగవంతమైన నియామక కోటా (యాక్సిలిరేటెడ్ రిక్రూట్‌మెంట్ కోటా) కింద నియమితులైన పిటిషనర్లు, 65 శాతం పదోన్నతి కోటా కింద నియమితులైన ఇతర న్యాయాధికారుల విషయంలో తాజాగా సీనియారిటీ జాబితాను తయారు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
ఇందుకు నాలుగు నెలల సమయమిచ్చింది. అప్పటి వరకు 2022 జనవరి 5 నాటి సీనియారిటీ జాబితా ఆధారంగా ఎలాంటి పదోన్నతులు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సవరించిన సీనియారిటీ జాబితా ప్రచురితమైన తరువాత పదోన్నతులను చట్ట ప్రకారం చేపట్టాలంది. తాజా సీనియారిటీ జాబితాను తయారు చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్ 2007లోని రూల్ 13(ఏ)లోని రోస్టర్ పాయింట్లను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.
2017 ఫిబ్రవరి 4న ఉమ్మడి హైకోర్టు తయారు చేసిన సీనియారిటీ జాబితాను దృష్టిలో పెట్టుకుని తాజా సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని తేల్చి చెపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
కొన్ని ముఖ్యాంశాలు..
» 2015 సంవత్సరానికి జిల్లా జడ్జీల సీనియారిటీ జాబితా 2022 జనవరి 5న జారీ అయింది. ఈ జాబితాలో రెండు వేర్వేరు కోటాల ద్వారా నియమితులు ఉన్నారు. 10 శాతం కోటా వేగవంతమైన నియామకం (డైరెక్ట్ రిక్రూట్)కాగా, 65 శాతం పదోన్నతి కోటా (సబ్ ఆర్డినేట్ జడ్జీల నుండి) కింద నియమితులైనవారు.
» రెండు కోటాల నియామక ఉత్తర్వులు వేర్వేరు తేదీలలో (65 శాతం కోటా 20–1–2016, 10 శాతం కోటా 8–2–2016) జారీ అయ్యాయి.
» ఈ ఆలస్యం కారణంగా 10 శాతం కోటా ద్వారా నియమితులను 65 శాతం కోటా నియమితుల కంటే జూనియర్స్‌గా పరిగణించడం జరుగుతుంది. రోస్టర్ పాయింట్ల ద్వారా సీనియారిటీ నిర్ణయం చేపట్టాలని సూచిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్, 2007లోని రూల్ 13(ఏ)ను ‘రద్దయిన జాబితా’ ఉల్లంఘిస్తోందని, నిజమైన సీనియారిటీ క్రమానికి ఇది విరుద్ధమని పేర్కొంటూ న్యాయాధికారులు గుండూరి రజని, జి.అన్వర్ బాషా, పి.భాస్కర్ రావు తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలను విన్న హైకోర్టు తాజాగా సీనియారిటీ జాబితా సవరణకు ఆదేశాలు ఇచ్చింది.