
సాక్షి, విజయవాడ: అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా నిలిచిపోనున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశ) నిర్ణయించింది. రూ. 670 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
రూ.670 కోట్లు చెల్లిస్తేనే మేం చర్చలకు వెళతామని లేకపోతే చర్చలకు వెళ్లేది లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. ‘‘మిగిలిన 2 వేల కోట్ల బకాయిల పై కార్యాచరణ ఇవ్వాలని.. అక్టోబర్ 10 లోగా మా సమస్యలన్నీ తీర్చాలి. మా సమస్యలు తీర్చకపోతే అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలన్నింటినీ పూర్తిగా ఆపేస్తాం. ప్యాకేజీలలో కచ్చితంగా మార్పులు చేయాలి.
..ప్యాకేజీలకు ఒక కచ్చితమైన సిస్టమ్‌ను పెట్టాలి. ఇన్స్యూరెన్స్ స్కీమ్‌కు వెళ్లే ముందు కచ్చితంగా మా బకాయిలు తీర్చాలి. ఇన్స్యూరెన్స్ కంపెనీలతో మమ్మల్ని కూడా కలుపుకుని వెళ్లాలి. బీమా ఆధారిత యూనివర్శల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేయడంలో మమ్మల్ని భాగస్వామ్యుల్ని చేయాలి’’ అని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది.