పోలీస్‌ బలుపుపై హైకోర్టు ఫైర్‌ | Andhra Pradesh High Court Fires On Police Department | Sakshi
Sakshi News home page

పోలీస్‌ బలుపుపై హైకోర్టు ఫైర్‌

Sep 28 2025 5:13 AM | Updated on Sep 28 2025 11:04 AM

Andhra Pradesh High Court Fires On Police Department

గుంటూరు ఎస్పీని పిలిపించి మంగళగిరి సీఐపై కేసుకు ఆదేశం 

విధుల్లో ఉన్న హైకోర్టు డ్రైవర్‌ లక్ష్మీనారాయణపై సీఐ తీవ్రంగా దాడి

జడ్జీలకు ఫైళ్లు ఇచ్చేందుకు వెళ్తుండగా వాహనం ఆపి కొట్టిన వైనం 

చెంప కందిపోయేలా పదేపదే దాడి... తీవ్రంగా పరిగణించిన హైకోర్టు వర్గాలు 

తమ ఉద్యోగిపై చెయ్యి వేయడమంటే హైకోర్టుపై వేయడమేనని వ్యాఖ్య 

న్యాయస్థానం పిలుపుతో తెల్లారి ఉదయమే హైకోర్టుకు వచ్చిన ఎస్పీ

హైకోర్టు డ్రైవర్‌నని లక్ష్మీనారాయణ చెప్పినా పట్టించుకోని పోలీసులు 

పోలీసుల దాడిపై హైకోర్టులో ‘కీలక’ వ్యక్తిని కలిసిన జడ్జీల డ్రైవర్లు 

లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు 

కానీ, నిందితుల జాబితాలో ‘సీఐ’ అని మాత్రమే రాసి అతితెలివి ప్రదర్శన 

హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించడంతో ‘సీఐ శ్రీనివాసరావు’ అని చేర్పు.. ‘నువ్వేంటిరా.. డ్రైవర్‌ నా కొడుకువి. నువ్వా నాకు చెప్పేది.. నేను సీఐను’ అంటూ పొట్టలో గట్టిగా గుద్దిన సీఐ 

లక్ష్మీనారాయణ సహా జడ్జీలకు ఇవ్వాల్సిన ఫైళ్లున్న వ్యాన్‌ స్టేషన్‌కు తరలింపు.. అత్యవసర ఫైళ్లయితే జడ్జీలే ఫోన్‌ చేస్తారులే అంటూ కానిస్టేబుళ్ల దురుసుతనం

సాక్షి, అమరావతి: అయినదానికి, కానిదానికి రాష్ట్రంలో సాధారణ పౌరులపైన తమ ప్రతాపం చూపిస్తూ వస్తున్న పోలీసులు మరోసారి ‘బలుపు’ ప్రదర్శించారు. ఎదురు చెప్పినవారిని చితక్కొట్టడమే పనిగా పెట్టుకున్న రక్షకభటులు ఏకంగా డ్యూటీలో ఉన్న హైకోర్టు ఉద్యోగిపైనే దాడి చేశారు. జడ్జీలకు కేసుల ఫైళ్లను అందజేసేందుకు వెళ్తుండగా అడ్డుకుని అత్యంత దురుసుగా ప్రవర్తించారు. బాధితుడు తాను ఎవరో వివరాలు చెప్పినా పట్టించుకోకుండా దూషిస్తూ దారుణంగా ప్రవర్తించారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఎం.లక్ష్మీనారాయణ హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌ కమ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గుంటూరు పరిధిలో ఉన్న న్యాయమూర్తులకు ఆయన కేసుల ఫైళ్లు అందజేస్తుంటారు. 

మరుసటి రోజు విచారించాల్సిన కేసులకు సంబంధించిన ఫైళ్లను రాత్రి న్యాయమూర్తులు ఇంటి వద్దనే చదువుతారు. తద్వారా విచారణ సులభమవుతుంది. ఇలా వారికి కేసుల ఫైళ్లను అందజేయడాన్ని సర్క్యులేషన్‌ అంటారు. లక్ష్మీనారాయణ గురువారం హైకోర్టు వాహనంలో ఫైళ్లను తీసుకుని రెయిన్‌ ట్రీ విల్లాల్లో నివసిస్తున్న జడ్జీలకు ఇచ్చేందుకు మంగళగిరి మీదుగా బయల్దేరారు. ఎర్రబాలెం–మంగళగిరి రైల్వే ఫ్లై ఓవర్‌పై మిగిలిన వాహనాలతో వెళ్తుండగా లక్ష్మీనారాయణ వాహనాన్ని ఓ కానిస్టేబుల్‌ అకస్మాత్తుగా ఆపారు. 

ఈ దారిలో వద్దని, విజయవాడ మీదుగా వెళ్లాలని చెప్పారు. రోజూ ఇదే మార్గంలో వెళ్తుంటానని, హైకోర్టు జడ్జీలకు అత్యవసరంగా ఫైళ్లు ఇవ్వాల్సి ఉందని లక్ష్మీనారాయణ సమాధానమిచ్చారు. దారి మళ్లించిన విషయం తెలియదన్నారు. ఈ సంవాదం జరుగుతుండగానే... మంగళగిరి గ్రామీణ సీఐ వై.శ్రీనివాసరావు వచ్చారు. రావడం రావడమే లక్ష్మీనారాయణను గట్టిగా చెంపదెబ్బ కొట్టారు. హైకోర్టు ఉద్యోగినని చెప్పినా వినిపించుకోలేదు. ‘నువ్వేంటిరా.. డ్రైవర్‌ నా కొడుకువి.. నువ్వా నాకు చెప్పేది.. నేను సీఐను’ అని దూషిస్తూ లక్ష్మీనారాయణ పొట్టలో గట్టిగా గుద్దారు. పదేపదే ఆయన చెంపపై కందిపోయేలా కొట్టారు. 

అర్జంట్‌ అయితే జడ్జీలే ఫోన్‌ చేస్తారులే
ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిచి లక్ష్మీనారాయణతోపాటు హైకోర్టు వాహనాన్ని కూడా మంగళగిరి స్టేషన్‌కు తీసుకెళ్లమని, ర్యాష్‌ డ్రైవింగ్‌ కింద లక్ష్మీనారాయణపై కేసు పెట్టాలని సీఐ శ్రీనివాసరావు ఆదేశించారు. కేసుల తాలూకు ఫైళ్లు ఉన్నాయని, జడ్జీలకు అందజేయడం అత్యవసరమని లక్ష్మీనారాయణ వివరించినా పట్టించుకోలేదు. మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించగా, ఓ కానిస్టేబుల్‌ ఆయన ఫోన్‌ను బలవంతంగా లాగేసుకున్నారు. 

స్టేషన్‌కు వెళ్లాక ఫోన్‌ అడిగినా ఇవ్వలేదు. వ్యాన్‌లో అత్యవసర ఫైళ్ల గురించి చెప్పగా, అంత అత్యవసరమైతే జడ్జీలే ఫోన్‌ చేస్తారులే అంటూ కానిస్టేబుళ్లు దురుసుగా మాట్లాడారు. లక్ష్మీనారాయణ అరగంట బతిమిలాడాక ఆయనకు ఉన్నతాధికారి నంబరు రాసుకునేందుకు మాత్రం మొబైల్‌ ఇచ్చారు. నంబరు రాసుకుని... మరో వ్యక్తి ఫోన్‌ నుంచి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లక్ష్మీనారాయణను పంపించేశారు.  

సంఘటితమైన జడ్జీల డ్రైవర్లు... కీలక వ్యక్తి దృష్టికి.. 
శుక్రవారం ఉదయం హైకోర్టులోని న్యాయమూర్తుల డ్రైవర్లు అందరూ కలిసి... తమ సహచరుడిపై పోలీసుల దాషీ్టకాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో హైకోర్టులో ‘కీలక’ స్థానంలో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి పోలీసుల దుందుడుకు చర్యలను వివరించారు. డ్యూటీలో ఉన్న ఉద్యోగి.. అందులోనూ హైకోర్టు ఉద్యోగిని కొట్టడమే కాక న్యాయమూర్తుల కేసుల ఫైళ్లున్న వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించడాన్ని హైకోర్టు వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. 

ఆ తర్వాత లక్ష్మీనారాయణ గుంటూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, నిందితుల జాబితాలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన సీఐ శ్రీనివాసరావు పేరును చేర్చలేదు. నిందితుల కాలమ్‌లో ‘‘సీఐ’’ అని రాసి సరిపెట్టారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఆయన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 132 కింద కేసు పెట్టారు. గాయమవుతుందని తెలిసినా గాయం చేయాలన్న ఉద్దేశంతో గాయపరిచారంటూ సెక్షన్‌ 115(2) కింద కూడా కేసు నమోదు చేశారు.    

ఆగమేఘాలపై వచ్చిన జిల్లా ఎస్పీ
సీఐ శ్రీనివాసరావు ఏకంగా హైకోర్టు ఉద్యోగిని కొట్టడం, హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో గుంటూరు ఎస్పీ శుక్రవారం ఉదయం ఆగమేఘాలపై హైకోర్టుకు వచ్చి ఉన్నతాధికారులను కలిశారు. మొత్తం ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో సీఐ అని మాత్రమే రాయడంతో హైకోర్టులోని ‘కీలక వ్యక్తి’... ఎస్పీని గట్టిగా నిలదీశారు. మరోవైపు తమ ఉద్యోగిపై చెయ్యి వేయడమంటే హైకోర్టుపై వేయడమేనని హైకోర్టు వర్గాలు ఎస్పీకి తేల్చిచెప్పాయి. 

డ్రైవర్‌ లక్ష్మీనారాయణ తప్పు చేసి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరని ఎస్పీకి స్పష్టం చేశాయి. సీఐ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర విషయమని తెలిపాయి. పైగా న్యాయమూర్తులకు అందజేయాల్సిన కేసుల ఫైళ్లను కూడా స్టేషన్‌లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది కోర్టు పాలనలో జోక్యం చేసుకోవడమేనని ఎస్పీతో వ్యాఖ్యానించాయి. కాగా, పోలీసులు విధి లేని పరిస్థితుల్లో సీఐ శ్రీనివాసరావు పేరును లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో చేర్చారు.  

హైకోర్టు ఆగ్రహంతో ఘటన తీవ్రత అర్థమైన ఎస్పీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.  డ్రైవర్‌ లక్ష్మీనారాయణను కొట్టిన సీఐను నిందితుల జాబితాలో చేర్చిన ఆయన తదుపరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలని హైకోర్టు వర్గాలు భావిస్తున్నాయి. కాగా, సీఐ శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గంలోనే అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్రపడ్డారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement