
దళిత విద్యార్థిని మృతి ఘటన దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం
ఈ కేసు సీబీఐకి అప్పగించడం సముచితమన్న అభిప్రాయం
దర్యాప్తు పురోగతిని చెప్పాలని గుంటూరు జిల్లా ఎస్పీకి ఆదేశం
2017లో ఓ కాలేజీలో అనుమానాస్పదంగా మృతిచెందిన శ్రావణ సంధ్య
తన కుమార్తెది హత్య అని యువతి తల్లి జయలక్ష్మి ఆందోళన
సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టును ఆశ్రయించిన జయలక్ష్మి
తాజాగా విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్
సాక్షి, అమరావతి: ఓ దళిత విద్యార్థిని మృతి ఘటనపై దర్యాప్తులో పోలీసుల అలక్ష్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించడం సముచితమని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసే ముందు, ఈ కేసులో దర్యాప్తు పురోగతిని తెలియజేస్తూ ఒక నివేదికను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం
గుంటూరు జిల్లా బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో అమృతలూరు మండలం, గోపాయపాలేనికి చెందిన గర్నెపూడి శ్రావణ సంధ్య పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ 2017 ఫిబ్రవరి 28న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన కుమార్తెది హత్య అని, దీనికి కాలేజీ యాజమాన్యంతోపాటు రూంమేట్స్ కారణమంటూ మృతురాలి తల్లి గర్నెపూడి జయలక్ష్మి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
హత్య అనే అనుమానంతో జయలక్ష్మి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత అసలు ఈ కేసును దర్యాప్తు చేయకుండా పక్కన పడేశారు. దీంతో చేసేదేమీ లేక జయలక్ష్మి 2017 జూలై 6వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె మృతిపై సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
తాజా విచారణ సందర్భంగా శుక్రవారం నల్లపాడు పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది కొన్ని వివరాలను లిఖితపూర్వకంగా హైకోర్టు ముందుంచారు. వాటిని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, శ్రావణ సంధ్య 4వ ఫ్లోర్ నుంచి కింద పడే సమయంలో అక్కడ ఎవరూ లేరని పోలీసులు పేర్కొన్నారు. ఇదే పోలీసులు మృతురాలి హాస్టల్‌లో ఉంటున్న సహచరులను విచారించగా, వారు శ్రావణ సంధ్య 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి మరణించినట్లు పేర్కొన్నారు.
ఈ పరస్పర విరుద్ధమైన పోలీసు స్టేట్‌మెంట్లను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్... పోలీసులు ఈ కేసులో సరిగ్గా దర్యాప్తు చేయలేదని తేల్చారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. పోలీసు శాఖ దారుణ దర్యాప్తునకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రావణ సంధ్య మృతి కేసులో పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదన్న జయలక్ష్మి తరఫు న్యాయవాది జీవీ శివాజీ వాదనలతో ఏకీభవించడం మినహా కోర్టుకు మరో అవకాశం లేకుండాపోయిందన్నారు.