మందుబాబులకు సర్కారు షాక్‌ | Cabinet Approves Liquor Price Hike in Andhra pradesh | Sakshi
Sakshi News home page

మందుబాబులకు సర్కారు షాక్‌

Jan 9 2026 3:39 AM | Updated on Jan 9 2026 7:51 AM

Cabinet Approves Liquor Price Hike in Andhra pradesh

మద్యం బాటిల్‌పై రూ.10 చొప్పున పెంపు  తద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1,391 కోట్లు  

కానీ, బార్లపై రూ.340 కోట్ల అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను రద్దు 

షాప్‌ల మార్జిన్‌ కమీషన్‌ 14 నుంచి 15 శాతానికి పెంపు 

తద్వారా వ్యాపారులకు రూ.532 కోట్లు ప్రయోజనం 

ఈ మేరకు ఖజానాకు గండి.. రూ.10 పెంపుతో వచ్చే రాబడి రూ.519 కోట్లకే పరిమితం 

జల్‌జీవన్‌ మిషన్‌ కార్పొరేషన్‌ రూ.5 వేల కోట్ల అప్పునకు గ్యారెంటీ 

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి

సాక్షి, అమరావతి: మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఇదే సమయంలో బార్లు, మద్యం దుకాణదారులకు భారీగా లబ్ధి చేకూరుస్తూ, రాష్ట్ర ఖజానాకు పెద్ద గండికొట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం... మద్యం సీసాపై (బీరు, వైన్‌ మినహా) రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దుకాణదారుల మార్జిన్‌ కమీషన్‌ను 14 శాతం నుంచి 15 శాతం చేసింది. బార్లపై ప్రస్తుతం ఉన్న అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నును తొలగించింది.

ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మద్యం సీసాపై రూ.10 చొప్పున పెంచడం ద్వారా ప్రభుత్వానికి రూ.1,391 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. బార్ల వ్యాపారానికి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో వారికి ప్రోత్సాహంగా అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను రద్దు చేశామని చెప్పారు. దీంతో బార్ల యజమానులకు రూ.340 కోట్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ రూ.10 చొప్పున, దుకాణదారులకు విక్రయాల మార్జిన్‌ మనీ కమీషన్‌ ఒక శాతం పెంచ డం వల్ల రూ.195 కోట్లు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. ఇక 14 శాతం నుంచి మార్జిన్‌ కమీషన్‌ను 15 శాతం చేయడం ద్వారా రూ.337 కోట్లు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి చెప్పారు. అంటే, సీసాపై రూ.10 పెంపుతో వచ్చే రూ.1,391 కోట్ల ఆదాయంలో ఈ మూడు మినహాయించగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి రూ.519 కోట్లకు పరిమితం కానుంది.  

మరికొన్ని నిర్ణయాలు...
రూ.10 లక్షల వరకు నామినేషన్‌పై సాగునీటి పనులు 
సాగునీటి రంగంలో నామినేషన్‌పై ఇచ్చే పనుల పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు 
ఏపీ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ ఆమోదించిన ట్రూ అప్‌ చార్జీలు డిస్కమ్‌లకు 6 వా­యిదాల్లో తిరిగి చెల్లింపు. 

మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధి చుట్టూ 5 కి.మీ.లలో నిర్దేశిత పర్యాటక కేంద్రాలలో స్థానంతో సంబంధం లేకుండా 3 స్టార్, అంతకంటే ఎక్కువ హోటళ్లలో, ప్రస్తుత పరిమితులకు అదనంగా మైక్రో బ్రూవరీలకు అనుమతి. 
నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నుంచి రూ.5 వేల కోట్ల జల్‌ జీవన్‌ మిషన్‌ కార్పొరేషన్‌ అప్పునకు ప్ర­భుత్వ గ్యారెంటీ. గతంలో జల్‌ జీవన్‌ మిషన్‌­కు అప్పు పరిధి రూ.10 వేల కోట్లు కాగా, దానిని రూ.12 వేల కోట్లకు పెంచుతూ ఆమోదం. 

ఏపీ లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ రూ.250 కోట్ల మూలధన వ్యయంతో సమగ్ర లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్‌ కంపెనీగా ఏర్పాటు. 

 


నామినేషన్‌ ఆధారంగా నాన్‌ క్యాప్టివ్‌ వాణిజ్య కార్యకలాపాల కోసం మంజూరు చేసిన లీజుల విషయంలో, సంస్థ అంచనా వనరుల విలువలో ఐదు శాతం ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిన వా­యిదాలలో కచ్చితంగా చెల్లించాలి. అదనంగా, లీజు మంజూరు చేసే ముందు సంస్థ మూడేళ్ల సీనరేజీ రుసుమును తొలుతే చెల్లించాలి. దీనికోసం మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌–1966ను సవరించడానికి ఆమోదం.  

ఏపీ షెడ్యూల్డ్‌ కులాల కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ భవిష్యత్‌ డిమాండ్‌ను తీర్చడానికి, లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయడానికి ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి రూ.1,500 కోట్ల రుణ మంజూరు. 
ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు విజయవాడ ఎస్‌బీఐ నుంచి రూ.2 వేల కోట్ల టర్మ్‌ రుణానికి ఆమోదం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement