
సాక్షి, అమరావతి: అమరావతి పనులు నత్తనడకన సాగుతుండటంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణపై అమరావతి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమరావతి ఉద్యమంలో పని చేసిన మాకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ 13 నెలలు అవుతున్నా ఇప్పటి దాకా కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. సరికదా.. పనుల్లోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారని జేఏసీ మండిపడింది.
అమరావతి జేఏసీ సమన్వయ సభ్యుడు ఆలూరి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటిదాకా చాలావరకు ప్లాట్లలో రోడ్లు వేయలేదు. సరిహద్దు రోడ్లు కూడా వేయలేదు. పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. రాయపూడి వద్ద సీడీఎక్సెస్ రోడ్డు వద్ద పని ఎందుకు ఆగిపోయింది. ఈ పనిని ఎందుకు చేయలేకపోతున్నారు. వెంకటపాలెం వద్ద కూడా అలాగే ఉంది. కరకట్ట రోడ్డు పెంపు లేదు. మీడియాలో మాత్రమే ప్రచారం ఉంది.
10 ఎకరాలు కూడా రైతులను ఒప్పించుకుని ఎందుకు తీసుకుని లేకపోతున్నారు?. రైతులకు కౌలు డబ్బులు ఇంకా జమచేయలేదు.. ఆగస్టు వస్తున్న ఎందుకు చేయలేదు?. రాజధాని చట్టబద్దతపై పార్లమెంట్‌లో మాట్లాడాలి. అమరావతి ఉద్యమంలో పని చేసిన మాకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ 13 నెలలు అవుతున్నా ఇప్పటి దాకా కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు.