టీడీపీ దాడులపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: వైఎస్‌ జగన్‌ | YS Jagan Tweet On TDP Attacks In Andhra pradesh | Sakshi
Sakshi News home page

టీడీపీ దాడులపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: వైఎస్‌ జగన్‌

Jun 7 2024 5:45 AM | Updated on Jun 7 2024 7:36 AM

YS Jagan Tweet On TDP Attacks In Andhra pradesh

అరాచకాలను అడ్డుకోవాలి 

టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ తోడుగా ఉంటాం 

సోషల్‌ మీడియా సైనికులకు అండగా నిలుస్తాం 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని, గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకొని పచ్చ మూకల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలను తీవ్రంగా ఖండించారు. దాడులను అడ్డుకోవాలని గురువారం ఆయన సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా గవర్నర్‌కు విజ్ఞప్తి చేయడంతో పాటు, పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది.

ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. ఐదేళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement