బాబు పాలనలో సిండికేట్లకు పండగ.. రైతన్నలకు కన్నీరు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Speech At Bhimavaram Aqua Farmers Meeting | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో సిండికేట్లకు పండగ.. రైతన్నలకు కన్నీరు: వైఎస్‌ జగన్‌

Jul 15 2026 12:14 PM | Updated on Jul 15 2026 12:38 PM

YS Jagan Speech At Bhimavaram Aqua Farmers Meeting

సాక్షి, పశ్చిమ గోదావరి: కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని.. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం భీమవరంలో అక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్బంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

అక్వా రంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది. అ‍క్వా రైతులు దీనావస్థలో ఉన్నారు. ధరల పెరుగుదల హేతుబద్ధంగా ఉండాలి. ఇష్టానుసారం ఫీడ్‌ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తీరు అని జగన్‌ మండిపడ్డారు. 

చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్‌లకు పండగే పండగ.. రైతన్నలకు కన్నీరే. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఫీడ్‌, సీడ్‌ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్‌ చేస్తారు. చంద్రబాబు సిండికేట్‌ రాష్ట్రాన్ని నడిపిస్తోంది. ఆ సిండికేట్‌ చేతుల్లో రైతులు నలిగిపోతున్నారు అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అక్వా రంగంలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకే మా ప్రభుత్వంలో రెగ్యులేటరీ బోర్ (అప్సడా) ఏర్పాటు చేశాం. సీడ్‌, ఫీడ్‌ మార్కెటింగ్‌లో సమస్యలు వస్తే పరిష్కరించాం. అక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్‌ అందించాం. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నాం. మద్దతు ధర తగ్గకుండా మానిటర్‌ చేశాం. ఐదేళ్లలో సబ్సీడీ కింద రూ.3,306 కోట్లు చెల్లించాం. ఇందులో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల బకాయిల్ని మేమే చెల్లించాం. ఫీడ్‌రేట్లు, ధరల విషయంలో ఎప్పటికప్పుడు మానిటర్‌ చేశాం. 35 అక్వా ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు పెట్టాం. ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్‌ అసిస్టెంట్‌లను నియమించాం. మా హయాంలో అక్వా ఎగుమతుల విలువ రూ.20 వేల కోట్లు. బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌ అవార్డు కూడా అందుకున్నాం అని జగన్‌ గుర్తు చేశారు.

కానీ, చంద్రబాబు మేం తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏపీలో అక్వా రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రోజు కేజీ రొయ్య కౌంట్‌ రూ.230 దాటని పరిస్థితి.  నాలుగు నెలల్లో ఫీడ్‌పై కేజీకి 14-16 రూపాయలు ఎడా పెడా పెంచేశారు. ఏకపక్షంగా ధరలు పెంచొద్దని అనేకసార్లు చెప్పాం. ఇష్టానుసారం ఫీడ్‌ ధరలు పెంచుకుంటూ వచ్చారు. రేట్లు పెంచితే పెంచారు.. తగ్గినప్పుడు తగ్గించరా?. ముష్టి వేసినట్లు రూ.2 లు తగ్గిస్తే సరిపోతుందా?. చంద్రబాబు తీరు వంద కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అన్నట్లు ఉంది అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోనీ.. చంద్రబాబు అక్వా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?.  చంద్రబాబు ప్రతీ అడుగు మోసం.. మోసం. నరసాపురంలో మేం తెచ్చిన ఫిషరీస్‌ వర్సిటీని నిలిపివేశారు. రూపాయిన్నర విద్యుత్‌కు కోత పెట్టారు. రైతులకు ఇవ్వాల్సిన 12 వేల విద్యుత్‌కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అక్వా రైతులకు కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్‌లు ఇవ్వడం లేదు. ఫలితంగా.. జనరేటర్‌లు పెట్టుకుని సాగు చేసే పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి.. భీమవరం మెడికల్‌ కాలేజీ పనులు కూడా నిలిపివేశారు అని జగన్‌ అన్నారు.

అక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. నేనున్నాను. రైతుల కోసం ఉద్యమబాట పడతాం. మూడేళ్ల తర్వాత మన రైతు ప్రభుత్వం వస్తుంది. అప్సడాకు పూర్వవైభవం తెస్తాం. చంద్రబాబు సిండికేట్‌ను కూకటి వేళ్లతో సహా పెలికిస్తాం అని వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement