Assembly Elections: వేములవాడ రాజన్న ఎవరిని కరుణిస్తాడో..

Who Will Win Vemulawada Fight Between BRS BJP Congress - Sakshi

ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ప్రమాదకరంగా తయారయ్యారు. అధికార గులాబీ పార్టీ అభ్యర్థికే ఈ కష్టం రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎదుర్కొంటున్న సమస్యలే ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయి. ఇక్కడి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఓ యువనేత చాలా కష్టాలు పడుతున్నారట. తనదగ్గర ఉన్న అన్ని అస్త్రాలు ఆ అభ్యర్థి కోసం ప్రయోగిస్తున్నారట. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు? ఆ యువనేత ఎవరు? 

తాను పోటీ చేస్తున్న సెగ్మెంట్‌కు పక్కనే ఉన్న నియోజకవర్గంలో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కల్వకుంట్ల తారకరాముడు నానా కష్టాలు పడుతున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబుకు టిక్కెట్ నిరాకరించిన గులాబీ పార్టీ బాస్‌ చల్మెడ లక్ష్మీ నర్సింహారావుకు వేములవాడ టికెట్ కేటాయించారు. టిక్కెట్ వచ్చినప్పటినుంచే చల్మెడకు కష్టాలు మొదలయ్యాయి.

తనకు టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే రమేష్‌బాబు పార్టీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఉధృతంగా ప్రచారం చేయాల్సిన సమయంలో ఆయన జర్మనీ వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. తన పక్క నియోజకవర్గమే కావడంతో ఇప్పుడు వేములవాడ అభ్యర్థిని గెలిపించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేములవాడలో చల్మెడకు విజయం చేకూర్చండి...నేనే దత్తత తీసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు.

చల్మెడను గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటా.. చల్మెడను కాదు.. కేసీఆర్‌ను చూసి గెలిపించండి..అంటూ వేములవాడలో జరిగిన యువ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. స్వయంగా ఆయనే వేములవాడలో పోటీ చేస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ చేసిన ప్రసంగం విన్నవారు...అక్కడ పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి బలహీనతలను ఆయనే బయటపెట్టారా అనే చర్చ ప్రారంభించారు.

చల్మెడను గెలిపించకపోతే ఇక వేములవాడకు రానని చెప్పడం అంటే కేటీఆర్ తనవద్ద ఉన్న అస్త్రాలన్నీ వాడేసారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రమేష్‌బాబు సహాయ నిరాకరణ..పార్టీ అభ్యర్థి చల్మెడ తీరు.. ప్రజలతో కలిసే విషయంలోనూ.. ముఖ్యంగా క్యాడర్ ను కలుపుకుపోవడంలో ఆయన పూర్తిగా వెనుకబడి పోవడంతో.. చల్మెడ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

గతంలో నాల్గుసార్లు ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి, బీసీ నేత ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆది శ్రీనివాస్‌ మీద సానుభూతి పవనాలు వీయడంతో పాటు.. కాంగ్రెస్ వేవ్ కొంత కనిపిస్తుండటం.. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం పెద్దగా సపోర్ట్ చేయకపోవడంతో.. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి మరింత కష్టిస్తేగానీ.. కనీసం ఫైట్‌లో ఉండే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థి బలహీనతలు.. మరోవైపు స్థానిక నేతలు జీర్ణించుకోలేని స్థాయిలో ఆయన వైఖరి.. కేటీఆర్ మీటింగ్ అయిపోయిందో, లేదో.. వేములవాడ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడైన పుల్కంరాజు, ఆయన సతీమణితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకొందరు కౌన్సిలర్లు కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు అనుచరగణం కావడం విశేషం. 

అధికార బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పెద్దగా ప్రభావితం చేయగల నేత కాకపోవడంతో పాటు.. ఆయన వైఖరి నచ్చక చాలామంది పార్టీకి దూరమవుతున్నారు. అందుకే తన పక్క నియోజకవర్గమైన వేములవాడలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తారకరాముడికి తలబొప్పి కట్టినంత పనవుతోంది. అయితే యువసమ్మేళనంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నియోజకవర్గంలో చర్చకు దారి తీసాయి. చల్మెడను గెలిపించకపోతే వేములవాడ రానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీ అభ్యర్థి చల్మెడ నిస్సహాయతను తెలియచేస్తోందని అంటున్నారు. మరి చివరకు వేములవాడ రాజన్న ఎవరిని కరుణిస్తాడో చూడాలి..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top