
టీడీపీ రెండవ జాబితా కోసం పడిగాపులు
దేవినేని ఉమాకు సీటు కష్టమేనంటున్న బాబు
ఇరకాటంలో యరపతినేని, పొత్తు పోటులో బండారు సత్యనారాయణ
స్థానిక నేతల వ్యతిరేకతతో చింతమనేనికి ఎసరు
ఇరకాటంలో జేసీ బ్రదర్స్
ఎంపీ సీట్లపైనా చంద్రబాబు దోబూచులాట
బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చేదాకా ఏమీ చెప్పలేనంటున్న బాబు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు అవమానాలే తప్ప సీట్లు దక్కే పరిస్థితి లేదు. సమీకరణలు, పొత్తుల పేరుతో సుదీర్ఘకాలం పార్టీ కోసం పని చేసిన వారిని చంద్రబాబు పక్కనపెడుతున్నారు. తొలి జాబితాలో చాలామందికి సీటు నిరాకరించగా వారికి దాదాపు అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సీటు నిరాకరించిన చంద్రబాబు ఆయన కుటుంబంలో ఒకరికి సీటు ఇచ్చే యోచనలో ఉన్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో చింతమనేనిని పక్కనపెట్టారు.
చంద్రబాబుకు గట్టి మద్ధతుదారుగా ఉన్న తనకు తగిన గుణపాఠం చెప్పారని ఆయన రగిలిపోతున్నారు. చింతమనేని స్థానంలో ఆయన కుమార్తెకి సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. దీంతో తనను అవమానిస్తున్నారని, పార్టీ కోసం ఇన్నాళ్లూ పని చేయించుకుని ఇప్పుడు పక్కనపెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర కీలక నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు సీటు ఖరారు చేయని చంద్రబాబు ఆయన మద్ధతుదారులను సైతం పక్కనపెట్టారు.
యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో ఆయనకు సీటు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు వంటి వారికి సీటిచ్చి తనను కాదనడం అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కళాకు సర్దిచెబుతున్నా ఆయన మాత్రం ఒప్పుకోకుండా తన సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు.
లాబీయింగ్ వదలని గంటా.. చంద్రబాబు ససేమిరా !
మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పరిస్థితి మరీ ఇరకాటంగా మారింది. ఆయన్ను విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆయన ధన బలం, తన సామాజికవర్గ బలాన్ని చూపిస్తూ అధిష్టానాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం గంటాను విజయనగరం పంపించడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గంటా మాత్రం భీమిలి స్థానం కోసం అన్ని రకాలుగా లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. జనసేన పొత్తులో విశాఖ జిల్లా పెందుర్తిలో తన సీటు ఎగిరిపోతుండడంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తనకు సీటు ఇవ్వకపోతే తన తడాఖా చూపిస్తానని హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానంలో వలస నేత వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరంలో అవకాశం ఇస్తుండడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. తనకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని కృష్ణప్రసాద్ అందరికీ చెబుతూ మద్ధతు కోరుతున్నారు. దేవినేని ఉమా మాత్రం చివరి నిమిషంలో అయినా తనకే సీటు ఖరారు చేస్తారనే ఆశతో తిరుగుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఉమాను పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
యరపతినేనికి ఎసరే!
ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావును గురజాల నుంచి తప్పించాలనే నిర్ణయంతో పల్నాడు ప్రాంత టీడీపీలో అయోమయం నెలకొంది. యరపతినేని స్థానంలో వలస నేత జంగా కృష్ణమూర్తిని పోటీకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు మింగుడుపడడంలేదు.
ఆయన్ను నర్సరావుపేట ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నా దానిపైనా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ప్రస్తుతం యరపతినేని గాల్లో ఉన్నారు. మరోవైపు పొత్తులో తెనాలి సీటు జనసేకు పోవడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా తన పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తున్నా ఆయన్ను పట్టించుకున్న వారే లేరు.