ఉపాధి కూలీలకు మూడున్నర నెలలుగా అందని వేతనాలు
రూ.660 కోట్లకు చేరిన బకాయిలు
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
కూలీలకు పనులు కల్పించడంలోనూ విఫలం
సాక్షి, అమరావతి: వేతనాలు చెల్లించకుండా చంద్రబాబు సర్కారు ఉపాధిహామీ కూలీల కుటుంబాలను పస్తులుంచుతోంది. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు హాజరైన కూలీలకు ప్రభుత్వం మూడున్నర నెలలుగా వేతనాలు చెల్లించలేదు. దాదాపు రూ.660 కోట్లు బకాయిపడింది. పూటగడవక.. వేతనాలు అందక పేదలు అవస్థలు పడుతున్నారు. ఐదారు రోజుల్లో ఉగాది పండగ వస్తుంది.. ఇంకొద్ది రోజులకు శ్రీరామనవమి.
మధ్యలో రంజాన్ పండగ కూడా ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది పేద కుటుంబాల్లో పండగల సంతోషమే కనిపించడం లేదు. పనులు లేక... చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉపాధి పనిచేసిన కూలీలకు 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలి. ఇదే విషయం కేంద్రం చేసిన చట్టం చెబుతోంది. అయినా నెలల తరబడి ప్రభుత్వమే వేతనాలు చెల్లించకుండా పండగ రోజుల్లో సైతం పేదలను పస్తులు పెడుతోంది.
పనుల కల్పనలోనూ విఫలం
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల కల్పన తగ్గిపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఆర్థిక ఏడాదిలో 25 కోట్లకుపైగా పనిదినాలు కల్పించి పేద ప్రజలకు భరోసా కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ఏడాది 19 కోట్ల పనిదినాలు కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 46.55 లక్షల కుటుంబాలకు 25.54 కోట్ల పనిదినాలు పనులు కల్పించారు. చంద్రబాబు సీఎం అయ్యాక 2024 –25 ఆర్థిక ఏడాదిలో 24.22 కోట్ల పనిదినాలు కల్పించినా... అందులో చంద్రబాబు సీఎం కాకమునుపు 2024 ఏప్రిల్, మే నెలలోనే 11.68 కోట్ల పనిదినాల కల్పన పూర్తయింది. ఆర్థిక ఏడాదిలో మిగిలిన 10 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం కేవలం 12.54 కోట్ల పనిదినాలే కల్పించింది.
20 రోజుల్లో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం
మరో 20 రోజుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పోర్టల్ వెల్లడించిన గణాంకాల ప్రకారమే మార్చి 13 తేదీ వరకు 17.86 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంతో పోల్చితే దాదాపు ఏడున్నర కోట్ల పనిదినాలు తక్కువ కావడం గమనార్హం. మరోవైపు చేసిన పనికీ నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో ప్రస్తుతం రోజు వారీ 5.5లక్షల మంది కూలీలు మాత్రమే పనులకు హాజరవుతున్నారు.


