ఇండ్రస్టియల్‌ ఏరియాలో... డ్రగ్‌ రాకెట్‌ | Massive Drug Bust in Kondapalli Industrial Area | Sakshi
Sakshi News home page

ఇండ్రస్టియల్‌ ఏరియాలో... డ్రగ్‌ రాకెట్‌

Mar 14 2026 5:03 AM | Updated on Mar 14 2026 5:03 AM

Massive Drug Bust in Kondapalli Industrial Area

హైదరాబాద్‌కు చెందిన డీఆర్‌ఐ అధికారుల మెరుపుదాడులు  

రూ.47 కోట్ల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలం స్వాదీనం 

800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల రసాయనాలు సీజ్‌  

ఇరువురు అరెస్ట్‌.. ముఖ్యమంత్రి నివాసానికి ఆవల ఒడ్డునే డ్రగ్స్‌ డెన్‌  

కొండపల్లి (ఇబ్రహీంపట్నం): చంద్రబాబు ప్రభుత్వ నిఘా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి, ఏరులైపారుతున్న మద్యం ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో తాజాగా డ్రగ్స్‌ తయారీకి వినియోగించే రసాయనాలు, మత్తుపదార్థాల భారీ రాకెట్‌ బయటపడ్డం ఆందోళనకు గురిచేస్తోంది.  అదికూడా కొండపల్లి ఇండ్రస్టియల్‌ ఏరియా (ఐడీఏ)లోనే కావడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి నివాసానికి, కొండపల్లి ఇండ్రస్టియల్‌ ఏరియాకు మధ్య కృష్ణానదే అడ్డం కావడం గమనార్హం.

ఇలాంటి ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు డ్రగ్స్‌ డెన్‌ను గుర్తించి దాదాపు రూ.47 కోట్ల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలంతోపాటు దీనికి అదనంగా డ్రగ్స్‌ తయారీలో వినియోగించే 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల రసాయనాలను స్వా«దీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ తయారీ రాకెట్‌లో హైదరాబాద్‌ బొల్లారంకు చెందిన సాయి త్రిభువన్, సౌరభ్‌కుమార్‌ను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇండ్రస్టియల్‌ ఏరియాలే  అక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతుండడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.  

అధికారులే విస్తుపోయేలా.. 
‘ఆపరేషన్‌ వైట్‌ హోమర్‌’ పేరుతో హైదరాబాద్‌ డీఆర్‌ఐ బృందం ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి ఇండ్రస్టియల్‌ ఏరియా (ఐడీఏ)లో మెరుపుదాడులు నిర్వహించింది. ఎమ్మెస్‌ రేస్‌ ఆర్గానిక్‌ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీలో భారీగా నిల్వచేసిన ఆ్రల్పాజోలంను గుర్తించారు. కెమికల్‌ కంపెనీ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలు అధికారులనే విస్తుపోయేలా చేశాయి. ఆ్రల్పాజోలం, డ్రగ్స్‌ తయారీలో వినియోగించే ముడి పదార్థాలు, లీటర్ల రసాయనాలతోపాటు ఫ్యాక్టరీలోని సెంట్రిఫ్యూజన్‌ మిషన్‌లు, డ్రైయర్లు, రియాక్టర్లను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న కంపెనీని సీజ్‌ చేశారు.  

తెలంగాణలోని కల్లు డిపోలకు డ్రగ్స్‌ తరలింపు 
ఇక్కడ తయారైన డ్రగ్స్‌ను తెలంగాణలోని కల్లు డిపోలకు తరలిస్తున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.  సుమారు 20 ఏళ్ల అనుభవం కలిగిన కెమిస్ట్‌ ఈ డ్రగ్స్‌ తయారీ రాకెట్‌లో మాస్టర్‌ మైండ్‌గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ తయారీపై నిఘా ఎక్కువగా ఉండటంతో కొండపల్లిలోని ఇండ్రస్టియల్‌ ఏరియాను అడ్డాగా చేసుకుని ఆ్రల్పాజోలం తయారు చేస్తున్నట్లు  అధికారులు ఒక అభిప్రాయానికి  వచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని  మరికొన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగుతుండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అధికారులు ఈ కెమిస్ట్‌ నెట్‌వర్క్‌ వెనుక ఉన్న ఫైనాన్షియర్‌లు, కొనుగోలు దారులు ఎవరన్న కోణంలో  విచారణ జరుపుతున్నారు.  

చంద్రబాబు సర్కార్‌ పర్యవేక్షణ వైఫల్యం
పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కంపెనీల కార్యకలాపాలపై డ్రగ్‌ కంట్రోల్‌ శాఖ, ఎక్సైజ్‌ శాఖ, పోలీస్‌ శాఖలు తరచుగా తనిఖీలు చేయాలి. అయితే గుట్టుచప్పుడు కాకుండా భారీ స్థాయిలో 237 కిలోల ఆ్రల్పాజోలం తయారీ జరగడం స్థానిక అధికారుల పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తోంది. ఇక ఈ డ్రగ్స్‌ను తెలంగాణలోని కల్లు డిపోలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడం చూస్తే దీనివెనుక అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌ ఉందని సూచిస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ముందుగానే ఈ కార్యకలాపాలను గుర్తించలేకపోవడం ప్రభుత్వ యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

పైగా రాష్ట్ర పోలీస్‌ లేదా డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం కాకుండా  హైదరాబాద్‌లోని  డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారుల చర్యలతో  ఈ రాకెట్‌ వెలుగులోకి రావడం గమనార్హం.  దీనివల్ల రాష్ట్ర స్థాయి నిఘా వ్యవస్థ సమర్థతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇండ్రస్టియల్‌ ఏరియాలో డ్రగ్స్‌ తయారీ జరగడం పెట్టుబడిదారులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అంశం. పరిశ్రమల పేరుతో అక్రమ కార్యకలాపాలు జరిగితే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, అసలు మాస్టర్‌మైండ్‌ ఎవరు? ఈ నెట్‌వర్క్‌ ఎంత పెద్దది? రాష్ట్రంలో ఇంకా ఇలాంటి యూనిట్లు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement