breaking news
Alprazolam
-
ఇండ్రస్టియల్ ఏరియాలో... డ్రగ్ రాకెట్
కొండపల్లి (ఇబ్రహీంపట్నం): చంద్రబాబు ప్రభుత్వ నిఘా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి, ఏరులైపారుతున్న మద్యం ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో తాజాగా డ్రగ్స్ తయారీకి వినియోగించే రసాయనాలు, మత్తుపదార్థాల భారీ రాకెట్ బయటపడ్డం ఆందోళనకు గురిచేస్తోంది. అదికూడా కొండపల్లి ఇండ్రస్టియల్ ఏరియా (ఐడీఏ)లోనే కావడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి నివాసానికి, కొండపల్లి ఇండ్రస్టియల్ ఏరియాకు మధ్య కృష్ణానదే అడ్డం కావడం గమనార్హం.ఇలాంటి ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు డ్రగ్స్ డెన్‌ను గుర్తించి దాదాపు రూ.47 కోట్ల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలంతోపాటు దీనికి అదనంగా డ్రగ్స్ తయారీలో వినియోగించే 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల రసాయనాలను స్వా«దీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ రాకెట్లో హైదరాబాద్ బొల్లారంకు చెందిన సాయి త్రిభువన్, సౌరభ్కుమార్ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇండ్రస్టియల్ ఏరియాలే అక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతుండడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. అధికారులే విస్తుపోయేలా.. ‘ఆపరేషన్ వైట్ హోమర్’ పేరుతో హైదరాబాద్ డీఆర్ఐ బృందం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇండ్రస్టియల్ ఏరియా (ఐడీఏ)లో మెరుపుదాడులు నిర్వహించింది. ఎమ్మెస్ రేస్ ఆర్గానిక్ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీలో భారీగా నిల్వచేసిన ఆ్రల్పాజోలంను గుర్తించారు. కెమికల్ కంపెనీ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలు అధికారులనే విస్తుపోయేలా చేశాయి. ఆ్రల్పాజోలం, డ్రగ్స్ తయారీలో వినియోగించే ముడి పదార్థాలు, లీటర్ల రసాయనాలతోపాటు ఫ్యాక్టరీలోని సెంట్రిఫ్యూజన్ మిషన్లు, డ్రైయర్లు, రియాక్టర్లను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న కంపెనీని సీజ్ చేశారు. తెలంగాణలోని కల్లు డిపోలకు డ్రగ్స్ తరలింపు ఇక్కడ తయారైన డ్రగ్స్‌ను తెలంగాణలోని కల్లు డిపోలకు తరలిస్తున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. సుమారు 20 ఏళ్ల అనుభవం కలిగిన కెమిస్ట్ ఈ డ్రగ్స్ తయారీ రాకెట్లో మాస్టర్ మైండ్‌గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారీపై నిఘా ఎక్కువగా ఉండటంతో కొండపల్లిలోని ఇండ్రస్టియల్ ఏరియాను అడ్డాగా చేసుకుని ఆ్రల్పాజోలం తయారు చేస్తున్నట్లు అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని మరికొన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగుతుండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అధికారులు ఈ కెమిస్ట్ నెట్వర్క్ వెనుక ఉన్న ఫైనాన్షియర్లు, కొనుగోలు దారులు ఎవరన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. చంద్రబాబు సర్కార్ పర్యవేక్షణ వైఫల్యంపారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కంపెనీల కార్యకలాపాలపై డ్రగ్ కంట్రోల్ శాఖ, ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖలు తరచుగా తనిఖీలు చేయాలి. అయితే గుట్టుచప్పుడు కాకుండా భారీ స్థాయిలో 237 కిలోల ఆ్రల్పాజోలం తయారీ జరగడం స్థానిక అధికారుల పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తోంది. ఇక ఈ డ్రగ్స్‌ను తెలంగాణలోని కల్లు డిపోలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడం చూస్తే దీనివెనుక అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉందని సూచిస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందుగానే ఈ కార్యకలాపాలను గుర్తించలేకపోవడం ప్రభుత్వ యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.పైగా రాష్ట్ర పోలీస్ లేదా డ్రగ్ కంట్రోల్ విభాగం కాకుండా హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారుల చర్యలతో ఈ రాకెట్ వెలుగులోకి రావడం గమనార్హం. దీనివల్ల రాష్ట్ర స్థాయి నిఘా వ్యవస్థ సమర్థతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండ్రస్టియల్ ఏరియాలో డ్రగ్స్ తయారీ జరగడం పెట్టుబడిదారులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అంశం. పరిశ్రమల పేరుతో అక్రమ కార్యకలాపాలు జరిగితే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? ఈ నెట్వర్క్ ఎంత పెద్దది? రాష్ట్రంలో ఇంకా ఇలాంటి యూనిట్లు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. -
కల్లు..కల్తీఫుల్లు!
జోగిపేట: కల్తీకల్లుతో జోగిపేట తూలిపోతోంది. పొద్దునే చాయ్ తగ్గినట్టుగా చాలామంది కల్లు తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కల్లుకు బానిసలైన వారు కొన్నిరోజుల పాటు ఇతర ప్రాంతాల్లో ఉండాల్సిన సమయంలో తమ వెంట 20, 30 లీటర్ల కల్లును తీసుకువెళ్తున్నారు. అలా కల్లును తీసుకెళ్లనివారు ఒక్కసారిగా కల్లు తాగడం మానేయడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అందువల్లే కల్లుకు బానిసలైనవారు నీళ్ల తాగకుండా ఉండగలం కానీ, కల్లు లేకుండా ఉండలేమంటున్నారు. వీరి వ్యసనాన్ని ఆసరాగా తీసుకున్న కల్లు కాంట్రాక్టర్లు పది లీటర్ల కల్లులో మత్తుపదార్థాలు కలిపి వంద లీటర్లు చేసేస్తున్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. కల్తీ ఎలా జరుగుతుందంటే... అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లోని ఈత చెట్ల నుంచి సేకరించిన కల్లును డిపోలకు తరలిస్తారు. డిపోల్లో సహజసిద్ధంగా లభించిన కల్లులో డైజోఫాం, అల్ఫాజోలం వంటి మత్తు పదార్థాలను కలుపుతారు. ఆ కల్లును లారీలు, ఇతర వాహనాల్లో గ్రామాలకు రవాణా చేస్తారు. రెండు మండలాలకు చెందిన మెజార్టీ గీత కార్మిక సంఘాలు వారు.. ప్రతి సంవత్సరం జోగిపేటకు చెందిన ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటారు. గీత కార్మికుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన కల్లునే సరఫరా చేయాల్సి ఉండగా, సదరు కాంట్రాక్టర్ కాసులకోసం కక్కుర్తిపడి మత్తుపదార్థాలను కల్లులో కలిపి వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. చాలా చోట్ల లెసైన్స్ లేని దుకాణాలు సైతం దర్జాగా కల్లును విక్రయిస్తున్నా, అధికారులు అమ్యామ్యాలతో కళ్లుమూసేసుకున్నారు. శాంపిల్స్ సేకరణ..అదే తంతు ఎక్సైజ్ శాఖ తమ పరిధిలోని దుకాణాలు, కల్లు డిపోల్లోని కల్లును ప్రతి నెల 20 శాంపిల్స్‌ను తీసి నిజామాబాద్‌లోని రీజినల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లేబరేటరీకి పంపుతారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటారు. కానీ లేబరేటరీ నుంచే వచ్చే రిపోర్టులో కల్తీ శాతం నిల్ అని వస్తోంది. 2013-14 సంవత్సరానికి గాను జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 250 నుంచి 300 వరకు కల్లు శాంపిల్స్‌ను లేబరేటరీకి పంపగా, అందులో 20 వరకు మాత్రమే కల్తీ అని ఫలితం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ 20 దుకాణాలు కూడా గ్రామీణ ప్రాంతంలోని లెసైన్స్‌లేని దుకాణాలు కావడం విశేషం. ఇక మిగతా దుకాణాల్లో కల్లు కల్తీకావడం లేదా అంటే..ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. వాస్తవానికి దాదాపుగా ప్రతి కల్లు దుకాణంలోనూ కల్తీ దందా సాగుతోంది. కానీ రిపోర్టుల్లో మాత్రం కల్తీ నిల్ అని వస్తోంది. ఇలా రిపోర్టు వచ్చేందుకు పెద్దమొత్తంలో నగదు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చేది కొంత..తయారయ్యేది కొండంత అల్లాదుర్గం మండలం ఫరిధిలోని గడిపెద్దాపూర్, వట్పల్లి, బహిరన్‌దిబ్బ, నాగులపల్లి గ్రామాలలోని ఈత చెట్ట నుంచి కల్లును అన్నాసాగర్, అందోలు డిపోలకు తరలిస్తారు. ఈ డిపోల్లో తయారైన కల్లును అందోలు, పుల్కల్ మండలాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తారు. కేవలం రెండు ప్రాంతాల కోసం మాత్రమే సరిపోయే కల్లును కల్తీ చేసి మిగతా గ్రామాలకు సైతం పంపిణీ చేస్తున్నారు. వారానికి 800 లీటర్ల కల్లు మాత్రమే ఈత వనాల నుంచి రవాణా అవుతున్నట్లు సమాచారం. కానీ జోగిపేట, అందోలు సొసైటీలకు చెందిన 8 కల్లు దుకాణాలతో పాటు పుల్కల్ మండలంలోని 20 గ్రామాలలోని కల్లు దుకాణాలకు ఈ రెండు డిపోల ద్వారా పంపిణీ చేస్తారు. కల్లు డిపోల్లో 30 శాతం ఎక్కువగా కల్లు మిగులుతున్నట్లయితే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇతర సొసైటీల వారు లిఖిత పూర్వకంగా కోరితే ఆ గ్రామాలకు కల్లును సరఫరా చేయాలని ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. ఈత వనాల నుంచి వచ్చేది తక్కువే అయినా మత్తు పదార్థాలతో కల్తీచేసి వందల లీటర్లు సర ఫరా చేస్తున్నారు. ఎక్సైజ్ సార్లకు ఏమీ తెలియదట! కల్లునుకల్తీ చేసి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నా అబ్బేం అదేం లేదంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. జోగిపేటకు సుమారుగా 25 కి.మీ దూరంలో ఉన్న ఈత చెట్ల నుంచి రెండు రోజులకోసారి స్వచ్ఛమైన కల్లును అందోలు, అన్నాసాగర్ డిపోలకు తరలిస్తారు. ఈ కల్లులో నీళ్లు, చక్కెరతోపాటు అల్ఫాజోలం, డైజోఫాం వంటి మత్తు పదార్థాలను కలుపుతారు. ఈ విషయం ప్రపంచమంతా తెలిసినా ఎక్సైజ్ అధికారులకు మాత్రం తెలియనట్లే నటిస్తున్నారు. కొన్ని చోట్ల వారికళ్లముందే ఈ తంతు జరుగుతున్నా పట్టించుకున్న పాపానపోరు. కల్తీ కల్లు సేవించి ఎంతో మంది అనారోగ్యానికి గురై మరణించినా పట్టించుకోవడం లేదు. దీంతో కల్తీ కల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.


