సాక్షి, పల్నాడు: తనపై దుష్ప్రచారం చేస్తూ, తనకు సంబంధించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూటమి నేతలపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుని కలిసిన ఆమె.. తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
కొంతమంది టీడీపీ నాయకులు గాలి పోగేసి తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఆ ఫిర్యాదులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. మీ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరు. ఇప్పటికే నా పైన ఏడు తప్పుడు కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు కూడా బనాయించారు..
..కొంతమంది పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. డీఎస్పీ హనుమంతరావు పచ్చ ఖద్దర్ చొక్కా వేసుకొని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. తెలుగుదేశం నాయకులు వాళ్ల నాయకుల మెప్పుకోసం తప్పుడు ఫిర్యాదులు నమోదు చేస్తుంటే.. అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిని, తప్పుడు కేసులు పెట్టిన అధికారిని ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదు.
.. శ్రీగణేష్ చౌదరి అనే వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అతనికి టీడీపీతోనే సంబంధాలు ఉన్నాయి. నాపైనా నా కుటుంబ సభ్యుల పైన నా అనుచరుల పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. వాళ్లనూ వదిలిపెట్టను. అవసరమైతే మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్లలో ఫిర్యాదులు చేస్తా. నా ధైర్యం మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నేను చిలకలూరిపేట నుంచి వేరే నియోజకవర్గానికి వెళ్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నేను చిలకలూరిపేట నుంచే పోటీ చేస్తాను. చిలకలూరిపేట పై మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారామె.


