సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రెండు రోజులకే, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో విలేకరుల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చెంగల్పట్టులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన వైకో, ఆ సమయంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయారు. సదర జర్నలిస్టుపై నోరు పారేసుకున్నారు.
గత ఐదేళ్ల డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలిందని, భూ రిజిస్ట్రేషన్ల నుండి ప్రతిదానిలోనూ ‘కటింగ్, కమిషన్’ వసూలు చేశారని వైకో ఆరోపించారు. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ జోక్యం చేసుకుంటూ..గత ఐదేళ్లుగా అదే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ అవినీతిపై ఎందుకు నోరు మెదపలేదు?అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. కూటమి రాజకీయాల్లో కొన్ని పరిమితులు ఉంటాయని, కూటమి ధర్మాన్ని పాటించడం వల్లే అప్పుడు మాట్లాడలేకపోయానని వైకో వివరణ ఇచ్చారు.
అయితే సదరు జర్నలిస్ట్ అదే ప్రశ్నపై పట్టుబట్టడంతో వైకో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నువ్వు ఒక దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చావు. నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు? మీ యజమాని పత్రికను అమ్ముకున్నాడు. నువ్వు కూడా ఒక అమ్ముడుపోయిన వ్యక్తివి’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతటితో ఆగకుండా సదరు విలేకరిని ప్రెస్ మీట్ వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించారు. వైకో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న ఎండీఎంకే కార్యకర్తలు, మద్దతుదారులు సదరు జర్నలిస్ట్‌పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు, డీఎంకే కూటమి నుండి బయటకు వస్తున్నట్లు జూన్ 27న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో వైకో అధికారికంగా ప్రకటించారు. గత తొమ్మిదేళ్లుగా కూటమిలో తమకు సరైన గౌరవం దక్కలేదని, డీఎంకే గుర్తుపై పోటీ చేయాల్సి రావడం తమ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని ఎండీఎంకే నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే కూటమి వీడిన వైకో, ఇప్పుడు డీఎంకే ప్రభుత్వ అవినీతిని టార్గెట్ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


