హాట్ హాట్​గా తమిళ పాలిటిక్స్..షణ్ముగంకి విజయ్‌ బంపరాఫర్‌! | tvk in talks with aiadmk mlas camped in puducherry | Sakshi
Sakshi News home page

హాట్ హాట్​గా తమిళ పాలిటిక్స్..షణ్ముగంకి విజయ్‌ బంపరాఫర్‌!

May 7 2026 7:56 PM | Updated on May 7 2026 8:36 PM

tvk in talks with aiadmk mlas camped in puducherry

సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళం మరింత పెరిగింది. టీవీకే నేతలు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీనియర్ నేత సి.వి. షణ్ముగం (మరో ఏక్‌నాథ్‌ షిండేలా) అనుచరులైన 28 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని రిసార్టులో తిష్టవేయడంతో  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి దగ్గరగా ఉన్నప్పటికీ, ఇంకా ఐదు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, ఏఐఏడీఎంకేలోని కొంతమంది ఎమ్మెల్యేలతో టీవీకే రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

పుదుచ్చేరిలోని పూరంకుప్పం రిసార్టులో ఉన్న 28 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం అనుచరులే. వీరిని టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం చేయడం కోసం వ్యూహాత్మకంగా తరలించినట్లు సమాచారం. చర్చల్లో షణ్ముగంకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించడం వంటి పవర్-షేరింగ్ ఫార్ములా చర్చలో ఉందని తెలుస్తోంది. మాజీ మంత్రి, టీవీకే అభ్యర్థి కె.ఏ. సెంగొట్టయన్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

అయితే, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వడాన్ని అంగీకరించలేదని సమాచారం. దీంతో పార్టీ లోపలే విభేదాలు తలెత్తాయి. ఒకవైపు షణ్ముగం, ఓ.ఎస్. మణియన్ వంటి నేతలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని భావిస్తుండగా, మరోవైపు పళనిస్వామి వర్గం దీనికి వ్యతిరేకంగా ఉంది.

గురువారం సాయంత్రం 4 గంటలకు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో పళనిస్వామి భేటీ కావాల్సి ఉంది. కానీ ఆ సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేసి, హుటాహుటిన పుదుచ్చేరి వెళ్లి రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో షణ్ముగంకు విజయ్ చేసిన ఆఫర్ వెలుగులోకి వచ్చింది.

రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, “చల్లటి గాలికోసం రిసార్ట్‌కు వచ్చాం” అని సమాధానం ఇచ్చారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో “అసలైన రాజకీయ నాయకులు మీరే” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

2021లో 66 సీట్లు గెలిచిన ఏఐఏడీఎంకే, తాజా ఎన్నికల్లో కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. డి. జయకుమార్, పి. థంగమణి వంటి సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు జిల్లాలో పార్టీ బలమైన కోటగా ఉన్నప్పటికీ, ఈసారి కేవలం ఒకే సీటు (థొండముతూర్) గెలిచింది. దీంతో పార్టీ బలం రాష్ట్రంలో మూడో స్థానానికి పరిమితమైంది.

ఈ నేపథ్యంలో, గెలిచిన ఎమ్మెల్యేలు టీవీకేలో చేరేందుకు పావులు కదుపుతున్నారని సమాచారం. షణ్ముగంకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని మూడు రిసార్టులకు తరలించి, వ్యూహాత్మకంగా రిసార్టులు మారుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని తెలుస్తోంది.

ఏఐఏడీఎంకే సీనియర్ నేత కేపీ అన్బళగన్ మాట్లాడుతూ.. విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి మేం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అర్హత లేదు. విజయ్ కేవలం సినిమా నటుడు మాత్రమే. సినిమాల ద్వారా వచ్చిన ఖ్యాతిని ఉపయోగించి ప్రజలను పాలించాలనుకోవడం సరైంది కాదు. ఏఐఏడీఎంకే ఎప్పటికీ విజయ్‌కు మద్దతు ఇవ్వదు. మా పార్టీ ఎమ్మెల్యేలు చెన్నైలో వేడి తట్టుకోలేక పుదుచ్చేరి రిసార్ట్‌లో ఉన్నారు. పార్టీ ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో నడుస్తోంది. తమిళనాడులో 47, పుదుచ్చేరిలో ఒకరు మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వెంటే ఉన్నారు’ అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement