పశ్చిమ బెంగాల్‌లో వచ్చే మార్పు ఇదే: ప్రధాని మోదీ | TMC has become carbon copy of Left PM Modi | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే మార్పు ఇదే: ప్రధాని మోదీ

Apr 11 2026 5:13 PM | Updated on Apr 11 2026 6:00 PM

 TMC has become carbon copy of Left PM Modi

ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్‌ 11) తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అధికార టీఎంసీ కూడా వామపక్ష పాలనా విధానాన్ని అనుకరించిందని, పశ్చిమ బెంగాల్‌లో మార్పును తీసుకురావడంలో విఫలమైందని చెప్పారు. 

ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీని ప్రజలు అదే విధంగా ఓడిస్తారని అన్నారు. “స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. బెంగాల్‌ను సవాలు చేసిన ప్రతి ఒక్కొక్కరి అహంకారం ఛిద్రమైపోతూ వచ్చింది. మొదట బ్రిటిష్, తరువాత కాంగ్రెస్, చివరికి వామపక్షాలు తమ అహంకారంతో కుప్పకూలిపోయాయి. ఇప్పుడు బెంగాల్ ప్రజలు టీఎంసీ అహంకారాన్ని ఛిద్రం చేస్తారు” అని ప్రధాని చెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఎంసీ వాగ్దానాలను నెరవేర్చలేకపోయిందని చెప్పారు.

అవినీతి వ్యవస్థలను టీఎంసీ ప్రోత్సహించిందని మోదీ ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని అన్నారు. “వామపక్షాలకు చెందిన గూండాలు, సిండికేట్లు అన్నీ తృణమూల్‌లోకి మారాయి. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా నుంచి కమిషన్ల వరకు అన్నింటిని ఇప్పుడు టీఎంసీ నియంత్రిస్తోంది” అని అన్నారు.

దేశ భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో యూసీసీ అమలు చేసి, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలుకుతామని అన్నారు. టీఎంసీ జంగిల్ రాజ్, సిండికేట్ రాజ్‌కు ముగింపు పలకడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారుతుందని చెప్పారు. కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement