దుర్గా స్టాలిన్‌ ఎంట్రీతో రాజకీయాల్లో హీట్‌ | durga stalin campaigns in sirkazhi constituency | Sakshi
Sakshi News home page

దుర్గా స్టాలిన్‌ ఎంట్రీతో రాజకీయాల్లో హీట్‌

Apr 11 2026 11:10 AM | Updated on Apr 11 2026 12:56 PM

durga stalin campaigns in sirkazhi constituency

సాక్షి,చైన్నె : తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు ఏ అభ్యర్థి తరపున నేరుగా ఓట్లు అడగని సీఎం స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్‌ తొలిసారిగా శీర్గాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీఎంకే కూటమి తరపున ఎండీఎంకే అభ్యర్థిగా సెంథిల్‌ సెల్వన్‌ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ ‘ఉదయ సూర్యుడు’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

ప్రప్రథమంగా..
సాధారణంగా దుర్గా స్టాలిన్‌ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కేవలం ఆలయ సందర్శనలకే పరిమితం అవుతుంటారు. గతంలో ఓ మారు కొళత్తూరులో తన భర్త స్టాలిన్‌ తరపున మహిళా ఓటర్లను కలిశారు. ఈ పరిస్థితులలో తాజాగా ఆమె నేరుగా ప్రచార రంగంలోకి దిగడం గమనార్హం.

శీర్గాలి సెంటిమెంట్‌
తమిళనాడు రాజకీయాల్లో శీర్గాళి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తుందే, ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న బలమైన నమ్మకం. దీనిని ‘దీర్ఘదర్శి నియోజకవర్గం’ అని కూడా పిలుస్తారు. అంటే రాష్ట్ర భవిష్యత్తును ఈ నియోజకవర్గ ఫలితం ముందుగానే చెబుతుందని అర్థం.

ఎండీఎంకే అభ్యర్థి.. డీఎంకే గుర్తు
వాస్తవానికి ఈ సీటు కూటమిలో ఎండీఎంకే పార్టీకి దక్కింది. వారు సొంత గుర్తుపై పోటీ చేస్తామని తొలుత ప్రకటించినా, చివరకు సెంటిమెంట్‌ దృష్ట్యా, డీఎంకే గుర్తు అయిన ‘ఉదయ సూర్యుడు’ పైనే అభ్యర్థిని నిలబెట్టారు. ఇక్కడ గెలిస్తేనే డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో స్టాలిన్‌ దంపతులు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీఎం స్టాలిన్‌ కూడా నాగపట్నంలో జరగాల్సిన సభను రద్దు చేసుకుని మరీ శీర్గాళిలో బహిరంగ సభ నిర్వహించారు. ‘నేను ఈ ఊరి అల్లుడిగా ఓటు అడగడానికి వచ్చాను’ అని స్టాలిన్‌ ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు. దుర్గా స్టాలిన్‌ తన స్వగ్రామం తిరువెంకాడు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో, తాను ఈ ఊరి కోడలినని, తన ఊరి ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించాలని కోరడం విశేషం. సెంటిమెంట్‌ను బలంగా నమ్మే దుర్గా స్టాలిన్‌ స్వయంగా రంగంలోకి దిగడంతో, ఈసారి శీర్గాళి సెంటిమెంట్‌ పలికి మళ్ళీ డీఎంకే అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement