వరకట్నం కోసం కోడలిపై రిటైర్డ్ రైల్వే అధికారి అమానుషం
కాన్పూర్‌లో వరకట్నం కోసం ఒక మహిళపై నడిరోడ్డుపై జరిగిన అమాను దాడి కలకలం రేపింది. మీనాక్షి పాండే అనే మహిళపై ఆమె మామ, రిటైర్డ్ రైల్వే అధికారి దారుణంగా దాడిచేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ రైల్వేలో అధికారిగా పనిచేసిన రమేష్ దూబే, కోడలు మీనాక్షిని వీధిలోకి బలవంతంగా ఈడ్చుకుంటూ వచ్చి, చేయి చేసుకోవడం, తన్నుతూ హింసించాడు. హృదయ విదారంగా ఆమె సాయం కోసం అర్థించిన వైనం వీడియోలో రికార్డైంది. ఈ క్రమంలో ఆమె బట్టలు కూడా చిరిగిపోయాయి. అయినా వదలకుండా వేధింపుల పర్వాన్ని కొనసాగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వెల్లు వెత్తింది. ఈ దారుణం జరుగుతున్న సమయంలో పోలీసు అధికారులున్నప్పటికీ, వారు జోక్యం చేసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
రూ. 20 లక్షల వరకట్నం కోసం
రూ. 20 లక్షల కట్నం తేవాలంటూ గత కొన్నాళ్లుగా భర్త , అత్తమామలు వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని మీనాక్షి పాండే అత్తమామలపై సంచలన ఆరోపణలు గుప్పించింది. నిరంతర వేధింపుల పర్వం సాగుతోందని, ఏళ్ల తరబడి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. అంతేకాదు తనకు విడాకులివ్వకుండానే, హిందూ వివాహ చట్టానికి విరుద్ధంగా తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని కూడా మీనాక్షి ఆరోపించారు.
🚨Kanpur Dowry Horror: Retired Railway Official Savagely Beats Meenakshi Pandey - Daughter need help 🙏
Incident :
A shocking viral video shows retired railway official Ramesh Dubey dragging his daughter-in-law, Meenakshi Pandey, onto the street. He brutally assaulted her,… pic.twitter.com/S5Vd1cdSoN— Ramesh Tiwari (@rameshofficial0) April 11, 2026
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రజలు తీవ్రంగా స్పందించారు. మహిళల రక్షణ కోసం, వరకట్నం హింసను నిషేధించే అనేక చట్టాలు ఉన్నప్పటికీ, మహిళలపై ఈ హింస ఇంకా కొనసాగుతోందనడానికి ఈ సంఘటన ఒక విషాదకరమైన నిదర్శనం. చట్టాలు ఎన్ని ఉన్నా, వరకట్న వేధింపులు ఇంకా కొనసాగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.పట్టపగలు, నడిరోడ్డుపై ఒక మహిళను ఇలా హింసిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?" అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని, ముఖ్యంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడం, ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో కాన్పూర్ పోలీసులు స్పందించారు.కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మీనాక్షి చేసిన ఆరోపణలపై సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్


