కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Public Meetings - Sakshi

నిర్మల్: సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రెండుసార్లు మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లాకు ఏమీ చేయలేదని విమర్శించారు. నిర్మల్‌లో కాంగ్రెస్ విజయభేరి సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే నిర్మల్ జిల్లాను దత్తత తీసుకుంటానని హామి ఇచ్చారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం: రేవంత్
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్ఢి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా ద్వారా రైతుకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. జనగామ విజయభేరీ సభలో మాట్లాడారు. 

అన్నారం , మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోవడానికి కేసీఆర్ అవినీతే కారణమని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యమం జరిగిన సమయంలో ముందు వరసలో ఉన్న హరీష్ రావు చేసిన పోరాటం నిర్మల్ ప్రజలు మరిచిపోలేదు.. కానీ ఉద్యమ కాలంలో ఇంద్ర కరణ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి ఎక్కడ ఉన్నారు మీకు తెలుసా? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముందుగా నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పారు.

ప్రమాదాలు జరిగినప్పుడు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే బయటకు రాని కేసీఆర్ పొన్నాల లక్ష్మయ్య కోసం బయటకి రావడం వెనుక మతలబు ఏంటో ప్రజలు పసిగట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రజలు తెలివిగలవారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 2024లో సంకీర్ణ సర్కారు ఖాయం.. బీఆర్‌ఎస్‌దే హవా: సీఎం కేసీఆర్

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top