న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధించడంపై ఆయన అభ్యంతరాలు తెలిపారు.
‘టెలిగ్రామ్ బ్యాన్’ అనేది ప్రశ్నపత్రాల లీకేజీలను ఆపేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వ కొత్త ఎత్తుగడ. అంటే, దొంగను పట్టుకోవడానికి బదులు, బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడం. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా టెలిగ్రామ్‌లో చదువుతున్నారు. నోట్స్, పరీక్షల సిరీస్‌లు, చర్చలు, సన్నద్ధత టెలిగ్రామ్ ద్వారానే జరుగుతోంది. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎలా పరిష్కారం అవుతుంది?
ఇది పూర్తి భద్రత ఇచ్చే మార్గం కాదు. దేశంలోని ప్రతి విద్యార్థికీ ఇది తెలుసు, ప్రశ్నపత్రాల లీకేజీ మాఫియాకూ తెలుసు. మరి తర్వాతి నిషేధం ఎవరిపై ఉంటుంది? వాట్సాప్‌పైనా? పరీక్ష రోజు విద్యార్థులను తనిఖీ చేస్తారు. జేబులను కత్తెరలతో కత్తిరిస్తారు. ప్రశ్నపత్రాలను వైమానిక దళం ద్వారా పంపిస్తారు. హడావుడికి మాత్రం కొదవ ఉండదు.
కానీ సమస్య మూలాలపై ఒక్క చర్య కూడా ఉండదు. ఎందుకంటే ప్రశ్నపత్రాల లీకేజీ మాఫియా ఇదే ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతోంది. యువతను రక్తకన్నీరు పెట్టిస్తోంది. మోదీజీ ఈ హడావుడి ఆపండి. విద్యార్థులపై కాదు, మాఫియాపై దెబ్బ కొట్టండి. ‘విద్యార్థుల ప్రతిధ్వని’ వినండి. లేకపోతే దేశ యువతకు తమ హక్కులు ఎలా సాధించుకోవాలో తెలుసు’’ అని తెలిపారు.
పోరాటాన్ని ప్రారంభించబోతున్నాం..
నీట్ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఉమేశ్, రియా గురించి రాహుల్ గాంధీ మరో ట్వీట్‌లో స్పందించారు. ‘‘నేను కోటాకు బయలుదేరాను. కానీ, నా మనసులో రెండు పేర్లు మార్మోగుతున్నాయి.. ఉమేశ్, రియా. నిన్న, సీకర్‌లో ఉమేశ్, డెహ్రాడూన్‌లో రియా.. ఇద్దరూ రీ-నీట్ ఒత్తిడిని తట్టుకోలేక తమ జీవితాలను ముగించుకున్నారు. 22, 23 ఏళ్ల వాళ్లే.. కలల ఆకాశంలో ఎగరాల్సిన వారు.. ఈ అన్యాయ వ్యవస్థ ముందు ఓడిపోయారు.
ఈ మరణాలు అవినీతితో నిండిన వ్యవస్థ ఫలితం. దీనికి బాధ్యులు మోదీ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థులను కాపాడాల్సిన చోట, ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, యువత భవిష్యత్తుతో వ్యాపారం చేసే వారికి పదేపదే అండగా నిలిచారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ రోజు కోటా నుంచి మేము ఒక పోరాటాన్ని ప్రారంభించబోతున్నాం. ఒక్కటే లక్ష్యం.. ఏ చిన్నారి కలలు ఇలా ఛిన్నాభిన్నం కాకూడదు, ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డను ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ప్రతి కుటుంబం అనుభవిస్తున్న ఈ వేదన ఇప్పుడు ‘విద్యార్థుల ప్రతిధ్వని’గా మారి దేశమంతా మార్మోగుతుంది’’ అని తెలిపారు.
कोटा के लिए निकल चुका हूँ पर दिल में दो नाम गूंज रहे हैं: उमेश और रिया।
कल, सीकर में उमेश और देहरादून में रिया - दोनों ने Re-NEET के दबाव में अपनी ज़िंदगी ख़त्म कर ली।
22 और 23 साल के बच्चे - जिन्हें सपनों के खुले आसमान में उड़ना था वो इस अन्यायी व्यवस्था से हार गए।
ये मौतें…— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2026


