కళ్లార్పకుండా ఏకబిగిన మూడున్నర గంటలపాటు అసత్యాల సంపద సృష్టి
రెండేళ్ల పాలనలో ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్
సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ పూర్తిగా ఎగవేత
సూపర్ సిక్స్ హామీల రూపంలోనే రెండేళ్లలో ప్రజలకు రూ.2,06,744.46 కోట్లు బకాయి
మరి హామీలను అమలు చేసిందెక్కడ చంద్రబాబూ? అని నిలదీస్తున్న ప్రజలు
నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీలకు ఎగనామం
అన్నదాతా సుఖీభవ, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సుకు అరకొరే.. కొత్త పింఛన్లు దేవుడెరుగు.. బాబు వచ్చాక ఉన్న పెన్షన్లే కోత
రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత.. అన్ని వర్గాలకూ చంద్రబాబు మోసం
2024 జూన్ నుంచే పథకాలన్నీ అమలు చేస్తామని బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటికీ బాండ్లు ఇచ్చిన చంద్రబాబు, పవన్
వాటిని తక్షణమే చెల్లించాలంటూ ప్రజలు డిమాండ్
26 నెలల్లోనే ఏకంగా రూ.3.63 లక్షల కోట్లు అప్పులతో చంద్రబాబు రికార్డు
కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్న పరిశ్రమలు, పెట్టుబడులు
అంతులేని అవినీతి, రెడ్‌బుక్ అరాచకాలతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్న బాబు సర్కార్
రాష్ట్రం అన్నింటా అథమ స్థానంలో ఉందంటూ కాగ్‌తో సహా తేల్చి చెబుతున్న కేంద్ర సంస్థలు
సాక్షి, అమరావతి: అవే అబద్ధాలు.. అవే కుతంత్రాలు.. అవే మోసాలు... ఇదీ సీఎం చంద్రబాబు తీరు!! తన రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను మీడియాకు మంగళవారం వివరిస్తూ.. రెండు హామీలు మినహా అన్ని అమలు చేశానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్పడంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్లారప్పకుండా.. కమిట్‌మెంట్‌తో ఏకబిగిన మూడున్నర గంటలపాటు అలవోకగా అసత్యాలు వల్లించడంపై అంతా విస్తుపోతున్నారు. అసలు మీ మేనిఫెస్టో మీకు గుర్తుందా బాబూ? అని నిలదీస్తున్నారు. మూడేళ్లుగా నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకు ఆడబిడ్డ నిధి హామీ ఏమైంది? 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామన్న హామీ ఎటుపోయింది? ఒక్క సూపర్ సిక్స్ హామీల కిందే రెండేళ్లలో దాదాపు రూ.2 లక్షల కోట్లకుపైగా ఎగ్గొట్టారు. మరి హామీలు ఎక్కడ అమలు చేశారు? ఎన్నికల హామీలను అమలు చేయకపోగా గతంలో వైఎస్ జగన్ పేదలకు ఇచ్చిన పథకాలను కూడా రద్దు చేశారని సర్వత్రా మండిపడుతున్నారు.
ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తా... వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. సూపర్ సిక్స్‌తోపాటు మేనిఫెస్టోలోని 143 హామీలు అమలు చేస్తానంటూ ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తు’కు గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్లను రాష్ట్రంలో ఇంటింటా పంపిణీ చేశారు. కానీ.. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారంటూ సీఎం చంద్రబాబుపై విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని రీతిలో కేవలం 26 నెలల్లోనే రూ.3.63 లక్షల కోట్లు అప్పులు చేయడం ద్వారా అప్పుల్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలిపిన సీఎం చంద్రబాబు.. జీఎస్‌డీపీ(రాష్ట్ర స్థూల ఉత్పత్తి), పారిశ్రామిక ప్రగతి నుంచి శాంతి భద్రతల వరకూ అన్నింటా అథమ స్థానానికి చేర్చారు.
రెండేళ్లలోనే ఏపీ అప్పులు ఏకంగా రూ.3,63,406 కోట్లకు ఎగబాకాయి. ద్రవ్య, రెవెన్యూ లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రెడ్‌బుక్ వేధింపులు, కప్పం వసూళ్లు భరించలేక రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి. పెట్టుబడులు తరలిపోతున్నాయి. అంతులేని అవినీతి, అరాచక పాలనతో 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే.. 2019–24 మధ్య విప్లవాత్మక సంస్కరణలు, సుపరిపాలనతో వైఎస్ జగన్ గాడిలో పెట్టి రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపారని, గత 26 నెలలుగా మళ్లీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారంటూ జెన్–జెడ్ తరం నుంచి మేధావుల వరకూ అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.
బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ
సార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం చేశారు. మహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి, కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి, టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. ఆ తర్వాత కుటుంబ యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నెంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్ సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీ నెంబరును టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్‌సైట్‌లో నమోదు చేసి, సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఏటా చేకూరే లబ్ధి.. ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనంపై వివరించారు. 
కర్నూలు జిల్లా కోడుమూరులో బెలుం నాగభూషణరెడ్డికి ఏటా రూ.లక్షా నాలుగువేల చొప్పున ఐదేళ్లలో రూ.5,20,000 లబ్ధి చేకూరుస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో జారీ చేసిన బాండు
ఆ తర్వాత టీడీపీకీ మద్దతు ఇస్తున్నట్లు మిస్డ్ కాల్ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్ సిక్స్‌సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్ నెంబర్‌కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. ఆ బాండ్లను కుటుంబ సభ్యుల ముందే డౌన్‌లోడ్ చేయించి.. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఈ హామీలను అమలు చేస్తానని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్‌సహా హామీలన్నీ 2024, జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో తేల్చిచెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ తనదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నమ్మబలికారు. ఇప్పుడు ఆ బాండ్లను చూపిస్తూ.. చంద్రబాబు ఎగ్గొట్టిన మొత్తాన్ని లెక్కలు వేస్తూ.. వాటిని తక్షణమే చెల్లించాలంటూ ప్రతి ఇంటా డిమాండ్ వినిపిస్తోంది.
ఉద్యోగులకు ఉత్తచెయ్యి..
ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. 5 డీఏలు పెండింగ్.. సరెండర్ లీవ్స్ పెండింగ్.. రూ.40 వేల కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. పేదలకు మూడు సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తానని నమ్మబలికి ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో ఆస్పత్రులు బిల్లులు అందక సేవలు నిలిపివేస్తున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం పెట్టడంలోనూ చంద్రబాబు సర్కార్ చేతులెత్తేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి 5.58 లక్షల మంది పిల్లలు వెళ్లిపోవడం రాష్ట్రంలో విద్యా రంగం దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.
సూపర్ సిక్స్ మోసాల ఖరీదు రూ.2,06,744.46 కోట్లు..
చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి 26 నెలలు కావస్తోంది. కొత్త పథకాలు ఇవ్వకపోగా గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను రద్దు చేసింది. వైఎస్ జగన్ సర్కార్ హయాంలో 2024 జనవరి నాటికి 66.34 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంటే.. ఈనెలలో బాబు సర్కార్ 60.13 లక్షల మందికే పెన్షన్ పంపిణీ చేసింది. అంటే 6.21 లక్షల పెన్షన్లు రద్దు చేశారు.

⇒ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున 2024–25లో రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు. 2025–26 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 2026–27 బడ్జెట్‌లోనూ నిరుద్యోగ భృతి ఊసే లేకుండా చేశారు. అంటే.. ఈ ఏడాదీ నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినట్లే. ఒక్కో నిరుద్యోగికి రూ.1.08 లక్షల చొప్పున 20 లక్షల మందికి ఇప్పటికే రూ.21,600 కోట్లు బకాయిపడ్డారు.
⇒ సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1.80 కోట్ల మంది. వీరికి ఏడాదికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. కానీ.. 2024–25, 2025–26, 2026–27 బడ్జెట్‌లలో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఆడబిడ్డ నిధి కింద ఒక్కో మహిళకు రూ.54 వేల చొప్పున 1.80 కోట్ల మంది మహిళలకు రూ.97,200 కోట్లు ఎగ్గొట్టారు.
⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానంటూ సీఎం చంద్రబాబు నమ్మబలికారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది పెన్షన్ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26, 2026–27 బడ్జెట్‌లోనూ ఆ పథకానికి పైసా కేటాయించలేదు. అంటే మూడు బడ్జెట్‌లలో రూ.28,800 కోట్లు బకాయిపడ్డారు.
⇒ తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్‌ఈ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్‌యూడైస్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే... ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఇక 2026–27లోనూ జమ చేస్తున్నది దాదాపు రూ.6,377 కోట్లే. అంటే తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే తల్లులకు రూ.26,554 కోట్లు బకాయిపడ్డారు.
⇒ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. మూడేళ్లకు కలిపి రూ.32,149.59 కోట్లు ఇవ్వాలి. అంటే.. ఒక్కో రైతుకు రూ.20 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలి. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.14 వేల చొప్పున ఇచ్చారు. 2026–27లో ఇప్పటికి 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పన ఇచ్చారు. అంటే.. ఇప్పటికే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.23,246.50 కోట్లు బకాయిపడ్డారు.
⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు చొప్పున మాత్రమే రూ.865 కోట్లు ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్‌లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. 2026–27 బడ్జెట్‌లోనూ రూ.2,601 కోట్లే కేటాయించారు. అంటే.. దీపం పథకం కింద మహిళలకు రూ.6143.96 కోట్లు బకాయిపడ్డారు.
⇒ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్ల మేర ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26లో ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లుగా ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా.. అందులో ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. తొమ్మిది రకాల సర్వీసులను ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండి ఉంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చేవారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేరలేదు. వెరసి సూపర్ సిక్స్ పథకాల రూపంలోనే ప్రజలకు చంద్రబాబు రూ.2,06,744.46 కోట్లు ఇప్పటికే బకాయిపడ్డారు.
హిస్టారిక్ విధ్వంసం ఎవరిది బాబూ?
రెండేళ్లలో రాష్ట్రం అంతటా అథమం!
⇒ రెండేళ్లుగా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బిహార్, జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా 22వ స్థానానికి పరిమితమైనట్లు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024– 25 ఏపీ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి కేవలం 1.97 శాతానికే పరిమితమైంది. అదే బిహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18 శాతంగా ఉంది.
⇒ రెండేళ్లలో రాష్ట్రంలోకి రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కారు నమ్మబలికినా అందులో ఏమాత్రం నిజం లేదని, వచ్చినవి రూ.6,962 కోట్లేనని పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రెడ్‌బుక్ వేధింపులు, కప్పం కట్టలేక రెండేళ్లలో ఏపీ నుంచి బయటకు వెళ్లిపోయిన కంపెనీల పెట్టుబడుల విలువ ఏకంగా రూ.6,215 కోట్లు కావడం గమనార్హం.

⇒ రెండేళ్లుగా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జీఎస్టీ వాటా గణనీయంగా పడిపోయింది. 2023–24లో రాష్ట్ర జీఎస్‌డీపీలో 2.20 శాతంగా ఉన్న జీఎస్టీ గడిచిన రెండేళ్ల కాలంలో 30 బేసిస్ పాయింట్లు తగ్గి 1.90 శాతానికి పడిపోయింది. రెండేళ్ల క్రితం వరకు సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలో నిలబడటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. పోలీస్ వ్యవస్థ పనితీరులో మన రాష్ట్రం 26వ స్థానానికి పరిమితమైంది. 



