చంద్రబాబు సర్కారు బరితెగింపు
నిన్నటి వరకు బీసీలపై రెడ్‌బుక్ పంజా
ఇప్పుడు మైనార్టీ నేతలపై కక్షసాధింపు
పట్నంబజారు(గుంటూరు): నిన్నటి వరకు ప్రతిపక్ష బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని రెడ్‌బుక్ పంజా విసిరిన చంద్రబాబు సర్కారు మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ కుటుంబాలను వెంటాడి వేధించింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి వంటి వారిపైనా అక్రమ కేసులతో అరాచకం సాగించింది. ఇప్పుడు మైనార్టీ నేతలపై కక్షసాధింపులకు దిగి తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా గుంటూరు తూర్పు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫాను అక్రమంగా అరెస్టు చేసింది.
ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం.. ఇప్పటికే ముస్తఫా, ఆయన తనయుడు బషీర్‌పై నూజివీడు పోలీసులు అక్రమ కిడ్నాప్ కేసు బనాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గుజరాత్‌లో వీరిద్దరినీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడితో ఆగకుండా గుంటూరు కాకాని రోడ్డులోని ముస్తఫా కుమార్తె, వైఎస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా నివాసంలోనూ దౌర్జన్యంగా తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు.


