వైఎస్సార్‌సీపీ ఐదేళ్లలో జీఎస్‌డీపీలో సగటు అప్పు 33.83 శాతం
2024–25, 2025–26లో మాత్రం ఏకంగా 36.20 శాతం అప్పులు
కేవలం రెండేళ్లలోనే జీఎస్‌డీపీలో పెరిగిన అప్పు శాతం 2.37
సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజెంటేషన్ వెల్లడి
సాక్షి, అమరావతి: గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కంటే తన రెండేళ్ల పాలనలోనే అప్పులు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజెంటేషన్ వెల్లడించింది. గత రెండేళ్ల ప్రభుత్వ అప్పులకు సంబంధించి మంగళవారం ఆయన సచివాలయంలో ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు.
గత రెండేళ్లలో బడ్జెట్‌లో ఎంత.. బడ్జెట్ బయట ఎంత అప్పు చేశారో చెప్పకుండా జీఎస్‌డీపీలో అప్పుల శాతాన్ని వివరిస్తూ ఆయన ప్రజెంటేషన్ సాగింది. దీని ప్రకారం చూసినా గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జీఎస్‌డీపీలో సగటు అప్పు కన్నా, తన రెండేళ్ల పాలన జీఎస్‌డీపీలోనే సగటు అప్పు 2.37 శాతం మేర పెరిగినట్లు స్పష్టం చేశారు. 2019–24 మధ్య జీఎస్‌డీపీలో సగటు అప్పు 33.83 శాతం ఉండగా.. 2024–25, 2025–26.. రెండేళ్లలోనే జీఎస్‌డీపీలో సగటు అప్పు 36.20 శాతానికి పెరిగింది.


