ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్ తదితరులపై కేసులు
శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాలకులు
పోలీసులను అడ్డం పెట్టుకుని ఫిర్యాదుల పరంపర
వైఎస్సార్‌సీపీ నాయకులపై వరుస అక్రమ కేసులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం పర్యటన విజయవంతం కావడంతో తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులపై నిత్యం కేసులు బనాయిస్తోంది. పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని క్షుద్ర రాజకీయాలు చేస్తోంది. దీనివెనుక పోలీసులే ఫిర్యాదుదారులు కావడం, వారే చర్యలు తీసుకోవడం గమనార్హం. దీనికంతటికీ టీడీపీ పెద్దలే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందిస్తున్నారు. వారిచ్చే జాబితాల మేరకు పోలీసు అధికారులు కేసులు నమోదు చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. తొలుత చింతాడ రవికుమార్ తదితరులపై కేసులు నమోదు చేయగా, మొన్న గొర్లె కిరణ్‌కుమార్ తదితరులపై కేసులు నమోదు చేశారు.
తాజాగా ధర్మాన కృష్ణదాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ తదితరులపై అక్రమ కేసులు పెట్టారు. రోడ్డు ప్రమాదాన్ని హత్యా నేరంగా చూపిస్తూ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జూలై 30న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం వచ్చారు. దీంతో అభిమాన నేతను చూసేందుకు దారి పొడవునా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోటెత్తారు. ఆ రోజు వచ్చిన జనప్రభంజనాన్ని చూసి తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. పోలీసులను వాడుకుని వరుస కేసులు పెడుతోంది.
తొలుత ఆమదాలవలస పోలీసు స్టేషన్ పరిధిలో చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసు బనాయించింది. ఆ తర్వాత జేఆర్‌పురం పోలీసు స్టేషన్ పరిధిలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు మరో 22మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. తాజాగా శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్ తదితరులపై అక్రమ కేసులు బనాయించారు. జూలై 30న జరిగిన ఘటన అని చెప్పి ఆగస్టు రెండో తేదీన శ్రీకాకుళం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వి.రామారావు ఫిర్యాదు చేసిన మేరకు వైఎస్సార్‌సీపీ నేతలుధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్, గేదెల పురుషోత్తం, రౌతు శంకరరావు, అంబటి శ్రీనివాస్, గొండు రఘురాం, సాయి, తదితరులపై కేసులు నమోదు చేశారు.


