పొగాకు రైతులపై సర్కారు పగ.. నేడు కొనుగోలు కేంద్రానికి వైఎస్‌ జగన్‌ | Former CM YS Jaganmohan Reddy to visit Devarapalli tobacco purchasing center | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులపై సర్కారు పగ.. నేడు కొనుగోలు కేంద్రానికి వైఎస్‌ జగన్‌

Aug 5 2026 5:42 AM | Updated on Aug 5 2026 5:50 AM

Former CM YS Jaganmohan Reddy to visit Devarapalli tobacco purchasing center

చంద్రబాబు పాలనలో దళారులదే రాజ్యం 

వ్యాపారులంతా సిండికేటుగా మారి దోపిడీ 

రూ.200 కంటే తక్కువకు కొనొద్దని జూన్, జూలైలో బాబు ఆదేశం 

అయినా సరే సరాసరి రూ.187కే పడిపోయిన ధర 

రెండు సీజన్లలో రూ.3 వేల కోట్లు నష్టపోయిన పొగాకు రైతులు 

రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ.. ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు 

నేడు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: పొగాకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, దారుణ వైఫల్యంతో పొగాకు రైతులకు రెండు సీజన్లలో ఏకంగా రూ.3 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు ఉరికొయ్యల పాలవుతున్నారు. తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వారందరికీ వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తోంది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఇప్పటికే అనేక పోరాటాలు చేసింది. అయినప్పటికీ చంద్రబాబు సర్కారులో ఏ మాత్రం చలనం లేకుండా పోయింది. 

ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి మరోమారు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును వైఎస్‌ జగన్‌ పరిశీలించనున్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకోనున్నారు. 

కిలోకు రూ.60 నుంచి రూ.70 చొప్పున నష్టం 
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పంటల కొనుగోళ్లలో దళారులే రాజ్యమేలుతున్నారు. ఇందుకు గడచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో పతనమైన పొగాకు ధరలే నిదర్శనం. దళారీ వ్యవస్థ రెండేళ్లలో బలంగా వేళ్లూనుకుంది. ఈ సీజన్‌లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాక జూన్‌ 18, జూలై 8న రెండుసార్లు సమీక్ష నిర్వహించిన సీఎం కేజీకి కనీస ధర రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయినా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో సరాసరి ధర రూ.187కే పడిపోయింది. హై క్వాలిటీకి రూ.240, మీడియం రూ.190, లో–గ్రేడ్‌ రూ. 110 చొప్పున గత నెల 28న ధరలు ప్రకటించారు. 

2023–24 సీజన్‌లో సరాసరి ధర రూ.288.65, 2024–25లో రూ.248.66 ఉండగా.. ఈ ఏడాది 105 వేలం రోజుల్లో 47.39 మిలియన్‌ కేజీలు అమ్మకం జరగ్గా సరాసరి ధర రూ.214.19. మాత్రమే ఉంది. ఈ లెక్కన రైతులు గత ఏడాది కంటే కిలోకి ఏకంగా రూ.60 నుంచి రూ.70 వరకూ నష్టపోతున్నారు. పదేళ్లుగా ప్రతిరోజూ వేలం ముగిశాక వచ్చిన బేళ్లు, రిజెక్ట్‌ అయినవి, సరాసరి ధరల వివరాలను రైతు గ్రూపుల్లో పెట్టేవారు. కానీ గత 10–12 రోజుల నుంచి ఈ నివేదికను రైతులకు అందుబాటులో లేకుండా తీసేశారు.   

నాడు భరోసా
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కకుండా నష్టాల పాలవడానికి వీల్లేకుండా గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి ఆర్బీకేను ఒక కొనుగోలు కేంద్రంగా ప్రకటించి, ప్రతి జిల్లాలోనూ జాయింట్‌ కలెక్టర్, మార్క్‌ఫెడ్‌ జాయింట్‌ ఎండీలను బాధ్యులను చేసింది. పంటల కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)ను ఆర్బీకేల్లో పొందుపరిచి, బోర్డును ప్రదర్శించింది. 

ఈ ధరలకన్నా ఏదైనా పంట ధరలు పడిపోతే, ఆర్బీకే పరిధిలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ) వెంటనే అప్రమత్తమయ్యేవాడు. సీఎం–యాప్‌ (కంటిన్యూస్‌ మోనిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌)ని అప్రమత్తం చేసేవారు. ఏ ఆర్బీకే పరిధిలో పంట ధర పడిపోయిందో అక్కడ జాయింట్‌ కలెక్టర్‌ రంగంలోకి దిగి వెంటనే పంట కొనుగోలు ప్రారంభించేవారు. అలా మార్కెట్‌లో పోటీ ఏర్పడేది. దీంతో ఏ రైతు నష్టపోయే పరిస్థితి లేకుండా చేశారు. ఇప్పుడీ వ్యవస్థ మొత్తం పూర్తిగా కనుమరుగైంది. ఈ క్రమంలో దళారులు సిండికేట్‌గా మారి రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement