
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారంటూ పులివెందుల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా కానీ పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘నా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారు. కర్రలు, రాడ్‌లతో ఓటర్లను భయపెడుతున్నారు. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు’’ అంటూ హేమంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ మూకలు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్‌ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ గూండాలు.. ఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్‌ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలా కాస్తున్నారు. ఎస్ఫీకి కాల్ చేసినా ఫలితం కనిపించలేదు. హేమంత్ గన్‌మెన్‌ని ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. నిన్నటి వరకు ఉన్న గన్‌మెన్‌ను తొలగించి మరొకరిని పంపించారు. బయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు.
నల్లపురెడ్డిపల్లిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ కమిషన్ చెప్పే మాటలన్నీ నీట మూటలయ్యాయి. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను, ఓటర్లను టీడీపీ గుండాలు నిర్భందించారు. ఏజెంట్‌గా ఉన్న మాజీ ఎంపీపీ బలరాంరెడ్డిని బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓటేసేందుకు అడ్డుకుంటున్నారని సామాన్య ఓటర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే టీడీపీ అరాచక శక్తులకు అండగా ఉన్నారని మాజీ ఎంపీపీ బలరాం రెడ్డి మండిపడ్డారు. మాపై దాడులు చేసేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగు నుంచి టీడీపీ గుండాలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓటేసేందుకు వెళ్తే ఓటర్ స్లిప్పులను చించేశారంటూ ఓటర్ల ఆవేదన వ్యక్తం చేశారు.
