సంక్షేమ పథకాలు గెలిపించలేవు: పవన్‌ కల్యాణ్‌ | Pawan Kalyan Welfare Remark Triggers Debate Over Poll Promises | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు గెలిపించలేవు: పవన్‌ కల్యాణ్‌

Jun 27 2026 1:05 PM | Updated on Jun 27 2026 1:38 PM

Pawan Kalyan Welfare Remark Triggers Debate Over Poll Promises

సాక్షి, మంగళగిరి: జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సంక్షేమ పథకాలతోనే ఎన్నికల్లో గెలవలేం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సంక్షేమ హామీల అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయనే చర్చ జోరందుకుంది. 

శనివారం మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. సంక్షేమ పథకాలను పార్టీ గౌరవిస్తుందన్నారు. అయితే అవసరమే అయినప్పటికీ అవే ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టవన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.  అయితే పవన్‌ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరో కోణంలో చర్చకు దారి తీస్తున్నాయి. ఎందుకంటే.. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఎన్నికల ప్రచారంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీల్లో కీలకమైనవి ఇప్పటికీ అమలులోకి రాలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు చంద్రబాబు, పవన్‌లు స్వయంగా బాండ్లు రాసిచ్చి మరీ హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని, ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చాలని వైఎస్సార్‌సీపీ పదేపదే డిమాండ్ చేస్తూ.. పోరాటాలు చేస్తోంది.

మరోవైపు రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందని చెబుతున్న చంద్రబాబు... ఇంకోవైపు భారీగా కొత్త అప్పులు చేస్తూనే, సంక్షేమ హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి సమయంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన సంక్షేమంతోనే ఓట్లు రావు అనే వ్యాఖ్యలు.. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం చేతులెత్తేసిన సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం జరగదని పరోక్షంగా పవన్‌ అంగీకరించినట్లుగా ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఏపీలో మీ ఓటు ఉండాలంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement