అసలే ఓటమి బాధతో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై మరో పిడుగుపడేలా చేశారు రితబ్రత బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన నేత రితబ్రత బెనర్జీ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నేతగా స్పీకర్ రథీంద్ర బోస్ గుర్తించారని ప్రకటించిన విషయం తెలిసిందే. తమ తిరుగుబాటు వర్గాన్ని ప్రత్యేక శాసనసభా పక్షంగా గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌ను కూడా స్పీకర్ అంగీకరించారని ఆయన చెప్పారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి మద్దతుగా 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిలిచి, శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్టు స్పీకర్ రథీంద్ర బోస్‌కు అధికారికంగా తెలియజేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ చర్యతో తృణమూల్ కాంగ్రెస్ శాసన విభాగంపై నియంత్రణ తిరుగుబాటు వర్గానికి వెళ్లినట్టయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత పార్టీ నాయకత్వానికి ఇప్పటివరకు ఎదురైన అతిపెద్ద సవాలుగా ఇది నిలిచింది.
అసలు రితబ్రత బెనర్జీ ఎవరు?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉలుబేరియా పూర్బా నియోజకవర్గం నుంచి రితబ్రత బెనర్జీ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై 11,838 ఓట్ల తేడాతో గెలిచారు. తృణమూల్ కాంగ్రెస్ భారీ ఎన్నికల పరాజయం ఎదుర్కొన్నప్పటికీ, రితబ్రత విజయం సాధించారు. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయం సాధించింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై సోమవారం బహిష్కరణకు గురైన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో రితబ్రత ఒకరు. ఒకప్పుడు సీపీఎంలో ఎదుగుతున్న నాయకుడిగా, వామపక్షాల భవిష్యత్ నేతగా భావించేవారు. అయితే ఓ వివాదాస్పద ఘటన, వివాదాస్పద ఇంటర్వ్యూ తర్వాత ఆయన ఎదుగుదల ఆగిపోయింది. 2018లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించిన వెంటనే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గం రితబ్రతను బహిష్కరించింది. ప్రతిపక్ష నేతగా శోభన్‌దేబ్ చట్టోపాధ్యాయ్‌కు మద్దతు తెలిపిన పార్టీ లేఖపై తమ సంతకాలు నకిలీవని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారని ఆరోపణలు వచ్చాయి.
రితబ్రత రాజకీయ ప్రయాణంలో అనేక కీలక మలుపులు ఉన్నాయి. వామపక్ష ఉద్యమంలో ప్రారంభించి, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వేగంగా ఎదిగి, సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. పార్టీ కీలక యువ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తర్వాత వామపక్షాల్లో ఆయన ప్రభావం తగ్గి, 2017లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన రాజకీయ పునరాగమనం ప్రారంభమైంది. అక్కడ కూడా సంస్థాగతంగా ఎదిగారు. తొలుత పార్టీ కార్మిక సంఘ విభాగ బాధ్యతలు అప్పగించారు. తర్వాత రాజ్యసభ నామినేషన్ ఇచ్చి ప్రోత్సహించారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, రితబ్రత ఉలుబేరియా పూర్బా నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్నారు.
ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిగా ఆయనను చూస్తున్నారు. టీఎంసీలోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును పొందారు. రితబ్రత బెనర్జీ పార్టీ నాయకత్వ అధికారాన్ని సవాలు చేస్తున్న తీరును మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సృష్టించిన రాజకీయ ప్రకంపనలతో పోలుస్తున్నారు.


