రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తారా?: బొత్స | MLC Botsa Satyanarayana Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తారా?: బొత్స

Jun 28 2026 12:31 PM | Updated on Jun 28 2026 1:14 PM

MLC Botsa Satyanarayana Serious Comments On CBN Govt

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరగడం లేదు. ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. ఇదేనా సంపద సృష్టి అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రభుత్వ అతిధి గృహంలో బస చెయ్యాలి. రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తారా?. ఇది ప్రైవేట్ సంస్థకి దోచి పెట్టడం కాదా?. మన దగ్గర ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు లేవా?. ఈ నిర్ణయం మన ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. ప్రభుత్వ భవనాలను రాష్ట్రపతి వాడుకోవాలి. అవసరం అనుకుంటే భవనాలను ఆధునీకరణ చేసుకోవాలి. మన దేశం పరువు, ప్రతిష్ట ఏం కావాలి అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘మా పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. అధికారం చేతుల్లో ఉందని.. మాపై కేసులు పెడుతున్నారు. వైఎ‍స్సార్‌సీపీతో పాటు, పోలీసుల మీద కూడా దాడి జరిగింది. మా పార్టీ నేతలపై టీడీపీ దాడులను ఖండిస్తున్నాం. రాష్ట్రంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులతో ఆటవిక పరిపాలన చేస్తున్నారు. అమరావతి రైతుల బాధలు తెలుసుకునేందుకు వెళ్లిన వారిపై హత్యా ప్రయత్నం చేశారు. పోలీసులను కూడా కొట్టారు. ఆ కానిస్టేబుల్ చావు బతుకుల మధ్య ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి.

రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది. అమరావతికి వెళ్తే తప్పేంటి?. రాజకీయ విమర్శలు చెయ్యాలనుకుంటే చేయండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా?. అమరావతిలో జరుగుతున్న అక్రమాలు బయట పడతాయని భయంతో ఉన్నారు. అమరావతి దోపిడీని చూస్తే తప్పేంటి?. దోపిడీ కాదు అమరావతిలో జరుగుతుంది అభివృద్దే అనుకుంటే మీకు భయమెందుకు?. ప్రభుత్వం మీ చేతిలో ఉందని మా నాయకులపై కేసులు పెడుతున్నారు.

మన సంస్కృతికి విరుద్దంగా చీచుల్లో బార్లు పెడుతున్నారు. ఎయిర్‌పోర్టుల్లోనూ ప్రభుత్వం బార్లు ఓపెన్‌ చేస్తున్నారు. విదేశీ సంస్కృతి వేరు.. మన సంస్కృతి వేరు. బార్లు పెట్టడమే సంపద సృష్టా?. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు.. మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్రం సబ్సిడీ మీద మామిడి కొంటుంది. మీరు దేనికీ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అన్ని పంటలు పండించే రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం దండగ అనే నాడుడి బాబు సార్ధకం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మొదట నష్టపోయేది రైతులే. మీకు ఓటేసిన పాపానికి ఇదేనా మీ పాలన. కూటమి నేతలు మాట్లాడితే అవి సూక్తులు.. ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవటం లేదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఆ సమయం ఆసన్నం అయ్యింది. విశాఖలో విలువైన భూములన్నీ పప్పు బెల్లల్లా పంచేస్తున్నారు. ఉపాధి కల్పన ఎక్కడా లేదు. భోగాపురం ఎయిర్‌పోర్టుకి దారి లేదు.. నీరు లేదు. అలాంటి విమానాశ్రయంలో బారు పెడతా అంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్న ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే మళ్ళీ యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారు.. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. మా నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అమరావతి రైతులు వారి సమస్యలు మాకు చెప్పుకున్నారు. అమరావతి రావాలని ఇబ్బంది పడ్డ రైతులే ఆహ్వానించారు. ‘మావిగన్’ మా విధానం అని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement