సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, ప్రచారాలు, రాజకీయ నాటకాలేనని.. చేసిందే మళ్లీ మళ్లీ చేస్తూ.. చెప్పిందే పదే పదే చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఒకే పెన్షన్ పథకాన్ని 22 సార్లు ప్రారంభించడం చంద్రబాబు ప్రచార పిచ్చికి నిదర్శనం. కొత్తగా ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశారా?. స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసమే 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు కొత్త నాటకం. న్యాయస్థానాల్లో నిలబడని బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించడం దుర్మార్గం. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాజకీయంగా సామాజికంగా పెద్దపీట వేసింది వైఎస్ జగన్’’ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.
‘‘భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో వైఎస్ జగన్ చేసిన కృషిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన పనులకు పేర్లు మార్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలనే చంద్రబాబు ఐదుసార్లు పంపిణీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. పాసు పుస్తకాలపై వైఎస్ జగన్ ఫొటో ఉందని దుష్ప్రచారం చేసినవాళ్లే ఇప్పుడు వాటిని పంపిణీ చేస్తున్నారు.
..రాయలసీమలో కరువు విలయ తాండవం చేస్తుంటే చంద్రబాబుకు ప్రచారం చేసుకుంటున్నారు. రాయలసీమలో పంటలు ఎండిపోతుంటే రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాయలసీమకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్న చంద్రబాబు.. బడ్జెట్‌లో ఎంత కేటాయించారో చెప్పాలి. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో సమాధానం చెప్పాలి.
..రైతులకు సాగునీరు, గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం సిగ్గుచేటు. టమాటా, మిర్చి, పొగాకు రైతుల కష్టాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల్లో ఎన్నింటిని పూర్తిగా అమలు చేశారో చంద్రబాబు చెప్పాలి. డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను, రైతులను, పెన్షనర్లను చంద్రబాబు మోసం చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఆసరా, చేయూత పథకాలతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారిపై కేసులు పెడుతున్నారు.

..డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి పాలనలో ప్రతిపక్షాలను ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించినా కేసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నా హోంమంత్రి స్పందించడం లేదు. రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయి.. సామాన్యుల ఆస్తులకు రక్షణ కరవైంది. ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపునకు దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
..ముఖ్యమంత్రి, మంత్రుల ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ప్రయాణాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. వైఎస్ జగన్ స్వర్ణ పాలనపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?. వైఎస్ జగన్ పాలన విధ్వంసమని ఆరోపిస్తున్న చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమంలో ఎవరి పాలనలో ఏం జరిగిందో చర్చిద్దాం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల కంటే రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. చంద్రబాబు రాజకీయ నాటకాలను, అబద్ధపు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారు.’’ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


