ఇప్పటిదాకా చూసింది ట్రైలరే.. | Sakshi
Sakshi News home page

ఇప్పటిదాకా చూసింది ట్రైలరే..

Published Sun, Aug 20 2023 1:31 AM

KTR Fires On Opposition Party Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ ముషీరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటివరకు తాము చూపినది ట్రైలర్‌ మాత్రమేనని, త్వరలోనే ప్రతిపక్షాలకు అసలు సినిమా చూపిస్తామని మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో కులమతాల పేరి­ట చిచ్చు పెట్టాలనుకునే దుర్మార్గులు, చిల్లర పార్టీల ఆటకట్టించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు–వీఎస్టీ జంక్షన్‌ మధ్య దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించి మాట్లాడారు. ‘‘55 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని దుర్మార్గులు.. ఇప్పుడు పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏమీ చేయని అసమర్థులు.. మళ్లీ వస్తున్నారు. మతం పేరిటో, కులం పేరిటో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అభివృద్ధిలో ముందుకు పోతున్న మనకు కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏడాదిలో వారం పదిరోజులపాటు కర్ఫ్యూ ఉండేది. ప్రజల మధ్య ఏదో ఓ పంచాయతీ పెట్టి కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొనేవి. ఇప్పుడు మతాలు, కులాలకు అతీతంగా అంతా కలసిమెలసి ముందుకు పోతున్నాం, చిల్లర పార్టీలు, నాయకుల మాటలకు మోసపోతే హైదరాబాద్‌ మళ్లీ వందేళ్లు వెనక్కుపోతుంది..’’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపించి, కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రిని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ట్రాఫిక్‌ చిక్కులకు పరిష్కారం 
ఒకప్పుడు అందరం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ ప్రాంతంలో సినిమాలు చూసిన వాళ్లమేనని.. సినిమా చూసి బయటికి వచ్చాక ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందిపడిన వారమేనని కేటీఆర్‌ చెప్పారు. ఈ స్టీల్‌ ఫ్లైఓవర్‌తో చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ చిక్కులకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఈ ఫ్లైఓవర్‌కు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టినట్టు తెలిపారు.

కార్మికుల తరఫున పోరాడిన నాయిని పేరు దీనితో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇందిరాపార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని.. లోయర్‌ ట్యాంక్‌బండ్, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ను కలుపుతూ టూరిస్ట్‌ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
బీఆర్‌ఎస్‌లో చేరిన కల్వకుర్తి నేత ఉప్పల వెంకటేశ్‌ 
కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఉప్పల వెంకటేశ్, మరికొందరు ఇతర పార్టీల నాయకులు శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని.. ఢిల్లీ గులాములకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ఆగం కావొద్దని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తమదని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించాలన్నారు.   

Advertisement
Advertisement