ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరకంగా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఆయన ఏమి మాట్లాడినా దానిని సినిమా డైలాగు అనుకుని చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉండడం ఆయన అదృష్టం అవుతుందేమో!. గత పది, పన్నెండేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పరస్పర విరుద్దమైన ప్రసంగాలు చేశారో లెక్కవేయడం కష్టమే కావచ్చు. అధికారంలోకి రావడానికి ఎన్ని తంటాలైనా పడి ఉండవచ్చు. ఒకసారి పవర్ చేతికి వచ్చాక బాధ్యతాయుతంగా ఉండకపోతే అది సమాజానికి నష్టం చేస్తుంది.
గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురి అవుతున్నాయి. డైవర్షన్ రాజకీయాలు చేసి టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను తానే కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు గందరగోళంగా ఉండడం ఒక స్పెషాలిటీగా కనిపిస్తుంది. కాకినాడలో కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలు కొన్నిటిని చూడండి. వైఎస్సార్‌సీపీ గూండాలను తొక్కి నారతీస్తా.. అధికారంలో లేకున్నా క్రిమినల్స్‌లా ఆ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయడం అంటే ఇటీవలికాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, లాకప్ డెత్ ఘటనలపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి చేస్తున్న యత్నంగా కనిపించదా!
మంత్రి లోకేష్ ఒకవైపు రెడ్ బుక్ అంటూ అరాచకపు రాజకీయాలు చేస్తుంటే, తాను ఎక్కడ వెనుకబడిపోతానో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తొక్కినారతీసే రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్‌కు ఆ శక్తి ఉంటే ఎవరిని తొక్కి నారతీయాలి? ముందుగా టీడీపీ, జనసేనలలో ఉన్న ఆ గూండా శక్తులను గుర్తించి వారి నార తీసి తదుపరి ఇతర పార్టీలవారి వద్దకు వస్తే బాగుండేది కదా! కొద్ది రోజుల క్రితం దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మరో నేత ఇంటిని కూల్చడానికి వెళ్లారు. ఆయనను ఏమి చేయాలో పవన్ చెప్పాలి కదా! గతంలో ఇదే చింతమనేనిని పవన్ తీవ్రంగా విమర్శించారు. తదుపరి పొత్తు కుదిరాక ఆయనకోసం ప్రచారం చేశారే!
శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులపై కనీసం కేసు అయినా పెట్టించారా? వేమూరు నియోజకవర్గంలో కొందరు జనసేన కార్యకర్తలపై టీడీపీ వారు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు కదా! ఒక యువతిని మోసం చేసి అత్యాచారం చేశారన్న అభియోగం ఎదుర్కోవడమే కాకుండా అసెంబ్లీ నుంచే వీడియోకాల్‌తో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఒక జనసేన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం సంగతి అలా ఉంచి, డిల్లీ మీటింగ్‌లో పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఏమనుకోవాలి! మరికొందరు జనసేన ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మాటేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాలను నడుపుతున్నారన్న కూటమి ఎమ్మెల్యేలను కనీసం మాట మాత్రంగానైనా హెచ్చరించలేకపోతున్నారే.
ఇక వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అణచివేయడానికి పోలీసు యంత్రాంగం రకరకాల అక్రమ కేసులు పెడుతోంది. అది చాలదన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. జనసేన మద్దతుదారు కుటుంబానికి చెందిన సాయికృష్ణ అనే రౌడీషీటర్‌ను పోలీసులే హింసించి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. అది చట్ట విరుద్దమైన చర్యగా చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి, అదేమీ తప్పుకానట్లుగా మాట్లాడడం ఏపాటి రాజధర్మం అవుతుంది. మరో వైపు అదే రౌడీషీటర్ కుటుంబం వద్దకు జనసేన బృందం ఎందుకు వెళ్లింది? ఏభై లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం అవ్వాలని మరో జనసేన నేత ఎందుకు రాయబారం చేశారు. అన్నిటికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రౌడీషీటర్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించుకుని వారిని ఓదార్చి పంపించారు.
ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయి కూటమి ప్రభుత్వానికి తీరని నష్టం చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి, డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ప్రకటనలు చేయడం వల్ల ఆయనకే నష్టం జరిగింది కదా! క్రిమినల్ కేసులు ఉండడమే వైఎస్సార్‌సీపీ బలం అంటూ మాట్లాడి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్‌లతో పాటు పవన్‌పై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు బయటపెట్టారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటంలో కారుమీద ఎక్కి కూర్చుని హడావుడి చేయడం ఏ రకమైన చర్య అవుతుంది? స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయితే, నడిరోడ్డుపై పవన్ కళ్యాణ్ పడుకోవడం చట్టసమ్మతమేనా? విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి రోజాపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేసినప్పుడు వాటిని సమర్థించినట్లు వ్యవహరించారే! తనపై హోం మంత్రి అనిత చేసిన ఒక వ్యాఖ్యకు బదులుగా మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన విమర్శను పవన్ తప్పుపట్టారు. అది మహిళలను అగౌరవపరిచినట్లు చిత్రీకరించారు. అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్‌తో సహా కూటమి ప్రముఖులు చేసిన పలు అభ్యంతర వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ నేతలు పేర్నినాని వంటివారు గుర్తు చేశారు.
మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ నటి రోజాపై నీచమైన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని పవన్ అభినందించింది నిజమా? కాదా? ఆ మాట చెప్పింది బండారే కదా! ఇక సుగాలి ప్రీతి అంశంలో మరింతగా పవన్ పరువు పోగొట్టుకున్నారు. జై భీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధారసహింతంగా పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలియచేశారే. సుగాలి ప్రీతి తల్లి పార్వతి సైతం అదే విషయం తేటతెల్లం చేశారే. తనకు కులం ఆపాదించవద్దని పవన్ కళ్యాణ్ తాజాగా కోరుతున్నారు. మంచిదే. ఆయన మొదటి నుంచి ఇదే ఉద్దేశంతో వ్యవహరించి ఉంటే అంతా అభినందించాలి. కాని కాపులంతా తనకు మద్దతు ఇవ్వాలని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోరిన సంగతి అసత్యమా? ఇప్పుడు అందుకు విరుద్దంగా కులం గురించి మాట్లాడడం దరిద్రం అని, తాను దేశభక్తుడినని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే రాజకీయాలలో కుదురుతుందా? మొత్తం ఎన్నికల మానిఫెస్టో సంగతెలా ఉన్నా, కనీసం కాపులకు ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఆయనపై లేదా? తాను హోం మంత్రిని కాకపోవడం అది క్రిమినల్స్ అదృష్టం అని అనడం ద్వారా ప్రస్తుత హోం మంత్రి అనితను అగౌరపరిచినట్లు కాదా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
నిజానికి లా అండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఆ సంగతి ఆయనకు తెలియదా! అన్నిటికి మించి పవన్ కళ్యాణ్‌ను టీడీపీ బాగానే వాడేసుకుంటోందన్న భావన వ్యక్తం అవుతోంది. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీపై పవన్ చేసే దూషణలకు టీడీపీ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది తెలుస్తూనే ఉంది కదా! చేసింది. సాయికృష్ణ కేసులో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడాలని యత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అనవసర వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలు అవుతుండడమే అందులో ఉన్న మర్మం అన్న విషయం అర్థం అవుతూనే ఉంది కదా! టీడీపీకి, ఎల్లో మీడియాకు అదే కదా కావల్సింది!

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


