బాబు మార్క్‌ కుట్ర సిద్ధాంతాలు.. ఎల్లో మీడియా వాయింపు! | KSR's Comments On Chandrababu's Party Warnings | Sakshi
Sakshi News home page

బాబు మార్క్‌ కుట్ర సిద్ధాంతాలు.. ఎల్లో మీడియా వాయింపు!

Jun 26 2026 12:47 PM | Updated on Jun 26 2026 1:11 PM

KSR's Comments On Chandrababu's Party Warnings

అధికారంలో ఉన్నవారికి తమ తప్పులను ఎత్తి చూపితే అవి కుట్రల్లా కనిపిస్తాయి. అంతే తప్ప తాము చేస్తున్న పనులలో తప్పులు జరుగుతున్నాయని అంగీకరించలేరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అధికారులను హెచ్చరించారట. ఇంతకీ ఆయన దృష్టిలో ఏది కుట్ర? ఏది కాదు? తాను విపక్షంలో ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేస్తుంటారు. అదే అధికారంలో ఉన్నప్పుడు విపక్షం సాక్ష్యాధారాలు చూపిస్తూ విమర్శలు చేసినా, ఆయా వివాదాలలో తన ప్రభుత్వం దొరికిపోయినా అదంతా కుట్ర అని చెబుతూ జనం నమ్మాలని కోరుకుంటారు. ఆయనకు ఎల్లో మీడియా తబలా వాయిస్తుంటాయి కనుక అలా సాగిపోతుంటుంది. తమ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం ఆయన లక్ష్యంగా ఉంటుంది.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో విపక్షంపై ఇదే ఆరోపణ చేసేది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆమె ఇది కుట్ర అని ఆరోపించి ఏకంగా ఎమర్జెన్సీని విధించి, అనేక మంది ప్రతిపక్ష పార్టీల నేతలను జైళ్లలో పెట్టించారు. ఎమర్జెన్సీని ఎత్తివేశాక కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైంది. అది వేరే విషయం.

కాంగ్రెస్ ఐ నుంచి రాజకీయ ఆరంగ్రేట్రం చేసిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని, తన మామ ఎన్టీఆర్‌ను పడదోసి అధికారంలోకి వచ్చారు. ఇదే పని 1984లో నాదెండ్ల భాస్కరరావు చేస్తే కుట్ర అని, ప్రజాస్వామ్య హననం అని అంటారు. సొంత మామ ఎన్టీఆర్‌ను కూలదోస్తే మాత్రం అది కుట్ర కాదని ప్రచారం చేసుకోగలిగారు. ఎన్టీఆర్‌ మాత్రం చంద్రబాబును తీవ్రమైన భాషలో నిందించారు. ఆర్టీజీఎస్ అధికారుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అన్నారట. ఎల్లో మీడియా చాలా ప్రముఖంగా ప్రచారం చేసింది. ఇంతకీ ఏది కుట్ర అవుతుంది? పోలీస్ స్టేషన్‌లలో నిందితులను హింసించి చంపిన ఘటనలను ఎవరికి తెలియకుండా చేయాలని అనుకోవడం కుట్ర అవుతుందా? ఆ విషయాన్ని బహిర్గతం చేసిన వైఎస్సార్‌సీపీ ది కుట్ర అవుతుందా?

విజయవాడలో సాయికృష్ణ అనే కాపు యువకుడు  మిస్సింగ్ అవడం, ఆ తర్వాత అతనిని దహనం చేసి బూడిద కూడా కనిపించకుండా చేశారన్న ఆరోపణ రావడం ఏమిటి? దాని గురించి నిష్పక్షపాతంగా విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవన్ని కుట్రలు అన్నట్లుగా మాట్లాడడం ఏమిటి. సాయికృష్ణ కేసులో ఇంతవరకు ఒక్క సీఐని మాత్రం అరెస్టు చేసి, మిగిలినవారి జోలికి వెళ్లకపోవడం కుట్ర అవుతుందా? కాదా? చివరికి సిసిటీవీ ఫుటేజీ మిస్ అవ్వడం అంటే కూటమిప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతుందా? లేదా? ఈ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబును రక్షించడం కోసం ప్రభుత్వం రకరకాల పన్నాగాలను పన్నుతోందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది.

మాజీ మంత్రి అంబటి రాంబాబు, జైభీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ వంటివారు అనేక ఆధారాలతో సహా ఆరోపణలు చేశారే. వాటికి జవాబు ఇవ్వకుండా కుట్రలు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా అధికారులకు ఎలాంటి సంకేతం పంపుతున్నారు? అంటే తప్పు చేసినా దొరకవద్దని పరోక్షంగా చెబుతున్నారా? లీగల్‌గా, టెక్నికల్‌గా దొరకరాదని చెబుతున్నట్లు అనిపించదా! సాయికృష్ణ రౌడీషీటర్ అని ప్రచారం చేసి, అతని కుటుంబాన్ని జగన్ పరామర్శించడాన్ని టీడీపీ ఎందుకు తప్పు పట్టింది? ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా రౌడీషీటర్ కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడడాన్ని ఏమని అంటారు? ఏమి న్యాయం చేశారో బయటపెట్టకుండా బాధిత కుటుంబ నోరు కట్టేయడాన్ని కుట్ర అంటారా? లేక ఓపెన్‌గా ప్రజాస్వామ్య హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ, మరి కొన్ని ఇతర ప్రతిపక్షాలు పోరాడడం కుట్ర అవుతుందా?

వివిధ ఘటనలకు కులం, మతం రంగు పులుముతున్నారని కూడా ఆయన అన్నారట. ఇలాంటి వ్యవహారాలలో చంద్రబాబుకు ఉన్న అనుభవం మరెవరికైనా ఉందా? అన్న చర్చ జరుగుతోంది. కందుకూరులో జనసేనకు చెందిన ఒక కాపు వ్యక్తి టీడీపీ నేత చేతిలో హత్యకు గురైతే ఏ ప్రాతిపదికన ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద చంద్రయ్య అనే స్థానిక టీడీపీ నేత ఫ్యాక్షన్ రాజకీయాలలో హత్యకు గురైతే బీసీ నేతను వైఎస్సార్‌సీపీ వారు చంపారంటూ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసిన మాట నిజమా? కాదా?

ఆ తర్వాత టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న అతని  కుమారుడికి ఏ ప్రమాణం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు? అందులో కుల రాజకీయం లేదా? వైఎస్సార్‌సీపీ హయాంలో క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన సుధాకర్ అనే డాక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తర్వాతకాలంలో ఆయన మద్యం మత్తులో విశాఖ నడిరోడ్డుపై నానా రచ్చ చేస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ ఆయన చేతులు కట్టి స్టేషన్‌కు తీసుకువెళితే దళిత డాక్టర్‌ను అలా చేస్తారా అంటూ విమర్శలు చేయడాన్ని  ఏమని అంటారు? అది కుట్ర కాదా? అతను అనారోగ్యానికి గురై మరణిస్తే, దానిని ఆనాటి ప్రభుత్వానికి ఆపాదించడం ఏ రాజకీయం అవుతుంది? అవినీతి కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు అయినా, మరో కేసులో ఇంకో నేత కొల్లురవీంద్ర అరెస్టు అయినా బీసీలను అరెస్టు చేస్తారా అంటూ ఎల్లో మీడియా ద్వారా విరుచుకుపడింది ఎవరు? దానిని కుల రాజకీయం అంటారా? ఇంకేమైనా అంటారా?

అసలు విషయంలోకి వెళ్లకుండా ప్రత్యర్ధులపై తట్టెడు బురద వేయడంలో చంద్రబాబు ఘనాపాటి అని ఆయన విమర్శకులు చెబుతుంటారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న, చితక కేసులు పెట్టించి, ఆయనపై దుష్ప్రచారం చేసింది ఎవరు? ఆయన కుమారుడు జగన్‌పై ఈ పదేళ్లలో ఎన్ని కుట్రలు చేశారు. ఎంత అబద్దపు ప్రచారం చేశారు? ఇక మత రాజకీయం గురించి చెప్పవలసి వస్తే చాంతాడంత అవుతుంది.

కొన్నిచోట్ల టీడీపీకి చెందిన వారు విగ్రహాలను ధ్వంసం చేస్తే ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటివారిలో ఒకరికి ఐదు లక్షల పరిహారాన్ని ఎలా ఇచ్చారు? తిరుమల లడ్డూపై లేని వివాదాన్ని సృష్టించి వైఎస్సార్‌సీపీపై అభాండాలు వేయడం కుట్ర అవుతుందా? కాదా? పోనీ జగన్ ఏ కుట్ర పన్నారో ఒక్కటైనా ఉదాహరణ ఇవ్వాలి కదా! అలాకాకుండా బట్టకాల్చి మీద వేయడం ఏమిటి? దానిని కదా కుట్ర అనాల్సింది. మొత్తం మీద ఇటీవలికాలంలో ప్రభుత్వపరంగా జరగుతున్న అనేక ఘటనలలో అటు పాలకులు, ఇటు అధికారులపై ఆరోపణలు వస్తుండడంతో చంద్రబాబు కుట్ర ధీరిని ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా?


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement